ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య యుద్ధం మొదలైంది. అధినేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంటే, కిందిస్థాయి కేడర్ ఏకంగా ముష్టి యుద్ధాలకు దిగుతున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ పథకం కింద రూ.10,000 ఇవ్వాలని నిర్ణయించారు. మూడు దఫాలుగా ఈ డబ్బు ఇస్తారు. మొదటి చెక్కు రూ.2500, రెండో చెక్కు రూ.3500, మూడో చెక్కు రూ.4000 చొప్పున చెల్లిస్తారు. మొదటిదఫా చెక్కుల పంపిణీతో పాటు పెంచిన పెన్షన్లను కూడా పంపిణీ చేస్తున్నారు.

చంద్రబాబు, జగన్
పసుపు కుంకుమ పథకం కింద ఇచ్చే చెక్కుల్లో మొదటి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రెండువర్గాల మధ్య గొడవ జరిగింది. పసుపు కుంకుమ పథకం కార్యక్రమాన్ని వైసీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారని అధికార పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలను నిలువరించడానికి టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఇరువర్గాలు పరస్పరం దూషించుకున్నాయి. టీడీపీ పథకాన్ని అడ్డుకునేందుకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రయత్నించారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. వారు చేసిన దాడిలో తమకు గాయాలయ్యాయని మండిపడుతున్నారు.
చిత్తూరు జిల్లాలో టీడీపీ వైసీపీ ఫైట్