కాంగ్రెస్ ఖాళీ అవుతుందా... టీడీపీ, వైసీపీ, జనసేన ఆకర్ష్ ?

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కిల్లి కృపారాణి

ఏపీలో కాంగ్రెస్ ఒంటరి పోరు ఆ పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు. దీంతో పార్టీలోని పలువురు కీలక నేతలు తమ దారి తాము చూసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు కాంగ్రెస్‌లోని కీలక నేతలను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

  • Share this:
    టీడీపీతో పొత్తు ఉంటే ఎన్నో కొన్ని సీట్లు దక్కించుకుని పోటీ చేయాలని భావించిన కాంగ్రెస్ నేతల ఆశలు ఆవిరయ్యారు. ఏపీలో ఒంటరి పోరే అంటూ కాంగ్రెస్ అధిష్టానం క్లారిటీ ఇవ్వడంతో... ఇక తమదారి తాము చూసుకోవడానికి కొందరు నేతలు సిద్ధమవుతున్నారు. కర్నూలు మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారని... త్వరలోనే ఆయన టీడీపీ లేదా వైసీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం మొదలైంది. ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉందని ఎక్కువగా ఊహాగానాలు మొదలయ్యాయి. ఏ పార్టీలో చేరాలనే దానిపై తన అనుచరులతో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకోవాలని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి నిర్ణయించినట్టు సమాచారం.

    మరోవైపు కేంద్ర మాజీమంత్రి, శ్రీకాకుళం మాజీ ఎంపీ కిల్లి కృపారాణి సైతం కాంగ్రెస్‌ను వీడేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఆమె త్వరలోనే వైసీపీలో చేరడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదని నిర్ణయానికి వచ్చిన తరువాతే ఆమె నిర్ణయానికి వచ్చారనే ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు కాంగ్రెస్‌లో కొనసాగుతున్న మరో కేంద్ర మాజీమంత్రి పల్లంరాజు, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు వంటి వాళ్లు కూడా ఎన్నికల్లోపే ఏదో ఒక పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

    ఇక కాంగ్రెస్‌ను వీడాలని భావిస్తున్న నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు ఏపీలోని రాజకీయ పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీతో పాటు జనసేన కూడా కాంగ్రెస్ కీలక నేతలను ఆకర్షించేందుకు రంగంలోకి దిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. తమ పార్టీలోకి వస్తే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశంతో పాటు పార్టీలో మంచి ప్రాధాన్యత ఇస్తామని సంకేతాలు కూడా పంపుతున్నారు. ఆయా పార్టీల్లో ఉన్న కాంగ్రెస్ మాజీ నేతలతో ఇప్పటికే ఇందుకోసం రాయబారాలు మొదలయ్యాయని ఏపీ రాజకీయవర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. ఎక్కువమంది నేతలు టీడీపీ లేదా వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తుంటే... పేరున్న నేతలను ఆకర్షించేందుకు జనసేన కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. మరోవైపు కీలక నేతలు హస్తానికి హ్యాండ్ ఇస్తే... ఎక్కువమంది నాయకులు అదే బాటలో నడిచి కాంగ్రెస్ ఖాళీ అయ్యే ప్రమాదం కూడా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.
    First published: