వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ప్రివిలేజ్‌మోషన్ నోటీస్ ఇస్తామని, టీడీపీ ఎమ్మెల్సీ బీ.టీ.నాయుడు తెలిపారు. ఆర్టికల్ 169 ప్రకారం ఏర్పడిన శాసనమండలి గురించి, ఛైర్మన్ గురించి చులకనగా మాట్లాడి, గవర్నర్ తర్వాత అంత హోదా ఉన్న చైర్మన్‌ను దుర్భాషలాడినందుకు ముఖ్యమంత్రిపై ప్రివిలేజ్‌మోషన్ నోటీసు ఇవ్వడానికి నిర్ణయించామన్నారు. శాసససభకు ఎన్నికైనవారే ప్రజలద్వారా ఎన్నుకోబడ్డారని, మండలి సభ్యులంతా దొడ్డిదారిన వచ్చారనే పదాన్ని ముఖ్యమంత్రి వినియోగించారన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు, స్థానికసంస్థల సభ్యుల ద్వారా, గవర్నర్, ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకున్న వారంతా అసమర్థులన్నట్లుగా అసెంబ్లీలో చిత్రీకరించాలని ముఖ్యమంత్రి ప్రయత్నించారని టీడీపీ ఎమ్మెల్సీ ఆరోపించారు. రాష్ట్రపతి నుంచి గెజిట్ నోటిఫికేషన్ వచ్చేవరకు మండలి కొనసాగుతుందని బీటీ నాయుడు స్పష్టం చేశారు. మండలి కార్యదర్శి, చైర్మన్‌పై ధిక్కారస్వరం వినిపించడానికి ప్రభుత్వమే కారణమన్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారైనట్టు తెలుస్తోంది. మార్చి 15 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్టు సమాచారం. నెల రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. సమావేశాలు ప్రారంభమైన వారం, పది రోజుల్లోనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, ఆమోదింపజేసుకుని ఆ తర్వాత ఇతర బిల్లులను సభ ముందుకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఎలాంటి అడుగులు వేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సవరణలకు బీజం వేస్తూ పంచాయతీరాజ్ బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపనుంది. వ్యవసాయ మండలి ముసాయిదా బిల్లుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపనుంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:February 13, 2020, 17:59 IST