ఏపీ ఎన్నికల్లో టీడీపీ సునామీ ఖాయమని టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా తనపై దాడి చేసి... తిరిగి తమపైనే నిందలు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈసీ ఇలా పనిచేయడం 40 ఏళ్లలో ఇప్పుడే చూశానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని చేసినా... ప్రజాస్వామ్యాన్ని ఓటర్లే కాపాడారని అన్నారు. వైసీపీ నేత అంబటి రాంబాబుపై కోడెల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసలు అంబటి రాంబాబు తనకు పోటీనే కాదని... అసలు ఆయన పేరునే తాను ప్రచారంలో ఎక్కడా ఉపయోగించలేదని అన్నారు. అసెంబ్లీకి రాని వైసీపీ నేతలు జీతాలు మాత్రం తీసుకున్నారని కోడెల విమర్శించారు.
తనపై దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియోలు బయటపెడితే... నిజం ఏంటో బయటపడుతుందని అన్నారు. రాష్ట్రం బాగుండాలి, మనం బాగుండాలనుకునే ఏ ఒక్కరూ కూడా జగన్కు ఓటేయరని కోడెల తెలిపారు. ఏపీని టీడీపీ స్వీప్ చేస్తుందని, జగన్ ఎవరి మోచేతి నీళ్లు తాగుతున్నారో ఆంధ్రవాళ్లకు తెలుసు కోడెల స్పష్టం చేశారు. ఆంధ్రవాళ్లు కుక్కలని తిట్టిన కేసీఆర్కు వత్తాసు పలుకుతారా? అని జగన్ను కోడెల ప్రశ్నించారు. జగన్ తీరు మార్చుకోకపోతే రాజకీయ నాయకుడిగా పనికిరాకుండా పోతారని వ్యాఖ్యానించారు.
Published by:Kishore Akkaladevi
First published:April 16, 2019, 20:06 IST