Andhra Pradesh: టీడీపీకి బిగ్ షాక్: రాజీనామా చేసిన కీలక నేత: చంద్రబాబు నిర్ణయంపై సీనియర్ల గుర్రు

ప్రతీకాత్మక చిత్రం

టీడీపీలో పంచాయతీ ఎన్నికలు దుమారం రేపుతున్నాయి.. చంద్రబాబు నిర్ణయంపై సీనియర్లు తిరుగుబాటు ఎగరేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసి తీరుతామని చెబుతున్నారు. పార్టీ సీనియర్ నేత అయితే.. చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

  • Share this:
    టీడీపీలో పరిషత్ తుఫాను చెలరేగింది. త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది. ఆ విషయాన్ని స్వయాన అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు కూడా. ఎన్నికల్లో అక్రమాలు జరిగినా.. అలాగే కొనసాగిస్తారని.. అందుకే ఎస్ఈసీ తీరును తప్పు పడుతూ ఎన్నికలలో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నామన్నారు చంద్రబాబు నాయుడు. బలవంతపు, అక్రమ ఏకగ్రీవాలపై చర్యలు తీసుకోక పోవడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. ఈ సందర్భంగా కొత్త ఎస్‌ఈసీ నీలం సాహ్నిని ఆయన ప్రశ్నించారు. కొత్త ఎస్‌ఈసీ వచ్చిరాగానే నిర్ణయం తీసుకోవడమేంటని చంద్రబాబు నేరుగా నిలదీశారు. ఈ ఎన్నికలు పెట్టేందుకు కొత్త ఎస్ఈసీకి అర్హత ఉందా అంటూ నిలదీశారు.

    టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో మెజార్టీ నేతలు ఎన్నికల బహిష్కరణ నిర్ణయం తీసుకున్నా.. పార్టీ సీనియర్లు కొందరు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయకపోతే కార్యకర్తలు ఒఫ్పుకోరని మండిపడుతున్నారు. పార్టీలో అందరి అభిప్రాయాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు.. పొలిట్ బ్యూరో సమావేశానికి డుమ్మా కొట్టారు. ఆయన మొదటి నుంచి ఎన్నిక బహిష్కరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు.. తాజాగా మరో కీలక నేత చంద్రబాబు నిర్ణయాన్ని బహిరంగంగానే వ్యతిరేకించారు..

    పరిషత్ ఎన్నికల బహిష్కరిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. పొలిట్ బ్యూరో నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. టీడీపీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు ఆ పార్టీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. అధిష్టానం తీసుకున్న ఎన్నికలు బహిష్కరించాలన్న నిర్ణయాన్ని ఆయన తప్పు పట్టారు. ఈ సందర్భంగా జగ్గంపేటలో కార్యకర్తలు, అభ్యర్థుల సమక్షంలో తన నిర్ణయాన్ని కటించారు. పార్టీ నిర్ణయంతో కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని.. అయితే తాను వారితో కలిసి ఉండాలి అనుకుంటున్నానని వ్యాఖ్యానించారు. తనకు పార్టీలో పదవులు వద్దని.. కార్యకర్తలతో కలిసి.. కార్యకర్తగా ఉంటాను అన్నారు. ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఆయన.. జగ్గంపేట నియోజకవర్గ ఇంఛార్జ్‌గానే కొనసాగుతానని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

    ఏది ఏమైనా మొత్తంగా.. పరిషత్ ఎన్నికలపై చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో చోటుచేసుకున్న ఈ పరిణామాలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పార్టీలోని సీనియర్లే ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఇంకా ఎంతమంది బయటకు వస్తారో చూడాలి.. ఇప్పటికే నామినేషన్ వేసిన అభ్యర్థుల్లో చాలామంది ఎన్నికల బరి నుంచి తప్పుకునేందుకు ఒప్పుకోమని అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నట్టు సమాచారం.
    Published by:Nagesh Paina
    First published: