TDP PROMISES FREE WATER TO PEOPLE IF WIN MUNICIPAL ELECTIONS NGS
AP Municipal Elections:పట్టణ ప్రజలకు ఫ్రీ వాటర్.. నో ట్యాక్స్ టీడీపీ హామీ
ప్రతీకాత్మక చిత్రం
పట్టణ ప్రజలకు సురక్షితమైన మంచి నీరు అందించడమే తమ లక్ష్యం అంటోంది టీడీపీ. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన తరువాత అందరికీ హక్కుగా మంచినీరు అందిస్తామని మరోసారి హామీ ఇచ్చింది టీడీపీ.
ఏపీలో పురపాలక, నగర పాలక సంస్థల ఎన్నికల్లో తమను గెలిపిస్తే.. సురక్షిత మంచినీటిని ఓ హక్కుగా, ఉచితంగా అందిస్తామన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు. రాబోయే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉచిత రక్షిత మంచినీటి కనెక్షన్, సున్నా నీటి పన్నుతో అందరికీ ప్రాథమిక హక్కుగా సురక్షిత తాగునీరు అందిస్తామనేది టీడీపీ ఎన్నికల హామీ అని మరోసారి స్పష్టం చేశారు.
సురక్షిత నీటిని ప్రజలకు అందించడంలో సీఎం జగన్ పూర్తిగా విఫలమయ్యారని కళా వెంకట్రావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో కలుషిత నీటి కారణంగానే.. అంతుచిక్కని వ్యాధితో ప్రజలు నేటికీ అనేక ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. అకస్మాత్తుగా రోడ్డుపై కళ్లు తిరిగి పడిపోతున్నారు.. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం సమస్యను గుర్తించలేకపోయిందని కళా వెంకట్రావు ఆరోపించారు. 2020 డిసెంబరులో ఈ వింత వ్యాధి వెలుగులోకి వచ్చిందని.. సుమారు 700 మంది ఆస్పత్రి పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపుగా 2.38 లక్షల మందిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది అన్నారు. వైసీపీ సర్కార్ నిర్లక్ష్యమే వీటికి కారణమన్నారు.
అలాగే కలుషిత నీరు తాగి కర్నూలులో ఒకరు ప్రాణాలు కోల్పోగా 50 మంది అనారోగ్యం పాలయ్యారని గుర్తు చేశారు. అపరిశుభ్ర వాతావరణం, పగిలిని నీటి పైపుల కారణంగానే మంచి నీరు కలుషితమైందన్నారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి వంటి మున్సిపాలిటీలు మంచినీటి సమస్యతో సతమతమవుతున్నాయన్నారు. నీటి సరఫరా బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడమే దీనికి ప్రధాన కారణమని మండిపడ్డారు. అందుకే వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు పూర్తిగా నమ్మకం కోల్పోయరన్నారు. ఆ ప్రభావం ఈ మున్సిపల్ ఎన్నికల్లో కపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు 12 కార్పొరేషన్ల అభివద్ధి, మంచినీటి సరఫరా, మురుగునీటి కాల్వల మరమ్మతులకు JNNURM పథకాల ద్వారా 1,449 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారన్నారు. అదే విధంగా 14వ ఆర్థిక సంఘం ద్వారా మరో 1,986 కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్నారు.
ఆంధ్రప్రదేశ్ నగరాభివద్ధి సంస్థ ద్వారా విజయనగరం, బద్వేలు, మార్కాపురం, కాకినాడ, అనంతపురం, గుంటూరు, ఇతర నగరాల్లో 850 కోట్ల రూపాయలతో మంచినీటి పథకాలను ప్రజలకు అందించామని గుర్తు చేశారు. విజయవాడ, గుంటూరు నగరాల్లో భూగర్భ మురుగునీరు నిర్వహణకు, వరద నీటి నిర్వహణకు 1,365 కోట్ల రూపాయలు వ్యయం చేశారు. నెల్లూరులో మురుగునీటి నిర్వహణకు హడ్కొ ద్వారా 1,138 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. ఇవన్నీ చంద్రబాబు నాయకత్వంలో ప్రజారోగ్యం కోసం టీడీపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలని వివరించారు.