ఏపీ టీడీపీలో అన్నీ చంద్రబాబే... అటు కేంద్రంలో... ఇటు రాష్ట్రంలో...

Ap assembly election results 2019: ఏపీ ఎన్నికల్లో టీడీపీ కోసం అన్నీ తానై వ్యవహరించారు ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. వయసు మీద పడుతున్నా... అవేవీ లెక్కచేయకుండా యువకులతో పోటీ పడి దూసుకుపోయారు.

news18-telugu
Updated: May 23, 2019, 6:37 AM IST
ఏపీ టీడీపీలో అన్నీ చంద్రబాబే... అటు కేంద్రంలో... ఇటు రాష్ట్రంలో...
చంద్రబాబు (File)
  • Share this:
ఏపీ సీఎంగా, టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ద్విపాత్రాభినయం చేస్తూనే ఈసారి ఎన్నికల బరిలోకి దిగిన నారా చంద్రబాబు నాయుడు ఎన్నడూ లేనంత స్ధాయిలో వ్యూహరచన చేశారు. ఎన్నికలకు రెండు నెలలు ముందుగానే ఓటర్లను ఆకట్టుకునేలా సంక్షేమ పథకాలను తయారు చేసుకున్నారు. సర్వేల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటూనే వ్యూహాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ముందుకు సాగారు. నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించేందుకు చంద్రబాబు రచించిన వ్యూహాలకు ఆయన టీమ్ క్షేత్రస్ధాయిలో సహకరించింది.

సుదీర్ఘ రాజకీయానుభవం కలిగిన 69 ఏళ్ల నారా చంద్రబాబునాయుడుకు ఈసారి ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. దీనికి ఓ కారణం ఆయన వయసు కాగా.. మరో కారణం ఆయన కుమారుడు నారా లోకేష్ ను అధికార పీఠంపై కూర్చోపెట్టేందుకు ఇంతకన్నా మంచి సమయం దొరకదన్న అంచనాలే. అందుకే ఈసారి ఎన్నికల కోసం చంద్రబాబు ఏడాది ముందునుంచే వ్యూహ రచన ప్రారంభించారు. అప్పటికే ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలిగిన నేపథ్యంలో తన మామ ఎన్టీఆర్ తరహాలోనే ప్రజల్లోకి వెళ్లి చావోరేవో తేల్చుకోవాలనేది ఆయన పట్టుదల. దీంతో వరుస ధర్మపోరాట దీక్షల పేరుతో ఢిల్లీలోని మోడీ ప్రభుత్వాన్ని, ఆయనతో జట్టు కట్టారంటూ విపక్ష నేత జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేయటం మొదలుపెట్టారు.

అవకాశం దొరికినప్పుడల్లా మోడీ, జగన్, కేసీఆర్ త్రయాన్ని ఎండగడుతూనే మరోవైపు సర్వేల పేరుతో జనం నాడికి పట్టేందుకు తీవ్రంగా శ్రమించారు. చంద్రబాబు టీమ లో కీలక సభ్యుడైన ప్రొఫెసర్ శ్రీనివాసులు నాయుడు ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తూ వాటి ఫలితాలను చంద్రబాబుకు అందజేశారు. వీటి ఆధారంగా చంద్రబాబు ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్ధుల విషయంలో ఓ అభిప్రాయానికి వచ్చారు. అదే సమయంలో తన కుమారుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ తో కలిసి అభ్యర్ధుల వడపోత కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేశారు.

లోకేష్ తండ్రితో కలిసి ఇంటివద్దే ఉంటూ అభ్యర్ధులను ఆచితూచి ఎంపిక చేశారు. దాదాపు రెండు నెలల పాటు శ్రమించి ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్ధులను దాదాపుగా ఖరారు చేశారు. అసంతృప్తులను బుజ్జగించేందుకు ఏపీ ఎన్జీవోల మాజీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ అశోక్ బాబును రంగంలోకి దించారు. అశోక్ బాబుతో పాటు ఆయన బృందం అసంతృప్తులను బుజ్జగించి చంద్రబాబు పని సులువు చేసింది.


అభ్యర్ధుల ఖరారు పూర్తికావచ్చే సమయానికి ప్రచార వ్యూహాలు కూడా సిద్ధమయ్యాయి. టీడీపీకి అత్యంత సన్నిహితంగా ఉండే సినీ దర్శకుడు బోయపాటి శ్రీను టీడీపీ తరఫున ప్రచార వ్యూహాలు రచించారు. ఆయనతో పాటు ఏపీ శాప్ నెట్ ఎండీ అనిల్, కిలారు రాజేష్, ఇతర బృందం కృషితో రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చక్కగా వివరించేలా ఎంతో నాణ్యమైన ప్రచార చిత్రాలు తయారయ్యాయి. వాటిని టీవీల్లో ప్రచారం చేయడం ద్వారా టీడీపీ అనుకున్న దానికంటే మెరుగైన మైలేజ్ సాధించింది. ఇవి ప్రజలకు సులువుగా చేరడంతో వీటి ప్రభావం ఎన్నికలపై స్పష్టంగా కనిపించింది.

డ్వాక్రా మహిళలు, రైతులను లక్ష్యంగా చేసుకుని టీడీపీ ఎన్నికలకు సరిగ్గా రెండు నెలల ముందు ప్రకటించిన పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాలు టీడీపీ వ్యూహాల్లో కీలకమయ్యాయి. మహిళలకు పదివేల రూపాయలను మూడు విడతలుగా అనుకున్న సమయానికి పంపిణీ చేయడం, రైతులకు ఆరువేల రూపాయల పెట్టుబడి సాయం వంటి అంశాలు టీడీపీకి బాగా కలిసివచ్చాయి. ఆసరా పింఛన్లను అప్పటికే రెట్టింపు చేసి 2 వేలకు పెంచిన చంద్రబాబు... తాము మరోసారి అధికారంలోకి వస్తే 3 వేలకు సైతం పెంచేందుకు సిద్ధమని హామీ ఇచ్చారు. దీంతో మహిళలు, రైతులు, పింఛనుదారులు ఈ ఎన్నికల్లో టీడీపీకి అండగా నిలిచేందుకు మార్గం సుగమమైంది.


చివర్లో చంద్రబాబు జాతీయ స్ధాయిలో తనకున్న పరిచయాలతో ఫరూక్ అబ్దుల్లా, మమతా బెనర్జీ, కేజ్రివాల్ వంటి నేతలను ప్రచారానికి తీసుకురాగలిగారు. వీరంతా తమ రాష్ట్రాల్లో ప్రజాభిమానం చూరగొన్న వారే. వీరిని రాష్ట్రానికి రప్పించి ప్రచారంలో వాడుకోవడం ద్వారా ప్రజల్లో టీడీపీకి జాతీయ రాజకీయాల్లో ఉన్న పట్టును మరోసారి నిరూపించుకున్నట్లయింది. ఇలా అనుక్షణం మారుతున్న పరిస్ధితులను గమనిస్తూ వ్యూహరచన చేసిన చంద్రబాబు టీడీపీకి మరోసారి విజయం కట్టబెట్టేందుకు వన్ మ్యాన్ షో నిర్వహించారనడంలో అతిశయోక్తి లేదు. ఆయన పన్నిన వ్యూహలకు టీమ్ సహకారం కూడా లభించడంతో చంద్రబాబు పని సులువైంది.
First published: May 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading