ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. అక్కడ బయటకు కనిపిస్తున్న రాజకీయాలకు భిన్నంగా తెరవెనుక వ్యూహాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరీ ముఖ్యంగా ఏపీలో బలపడాలని భావిస్తున్న బీజేపీకి చెక్ చెప్పేందుకు టీడీపీ ఎంతగానో ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ హిందుత్వవాదాన్ని కూడా ఎత్తుకుందనే ఊహాగానాలు వచ్చాయి. ఆలయాలపై దాడుల ఘటనల విషయంలో బీజేపీ కంటే దూకుడుగా వ్యవహరించిన టీడీపీ.. ఆ రకంగా బీజేపీకి పొలిటికల్ మైలేజీ రాకుండా చేయడంలో కొంతమేర విజయం సాధించిందనే ప్రచారం సాగుతోంది. అయితే ఏపీలో జరుగుతున్న పరిణామాల ఎఫెక్ట్ తిరుపతి ఉప ఎన్నికపై పడి బీజేపీకి మైలేజీ రాకుండా ఉండేందుకు కూడా టీడీపీ ముందస్తు వ్యూహాన్ని రచించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జనవరి 21 నుంచి తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని 700 గ్రామాల్లో పది రోజుల పాటు ధర్మపరిరక్షణ యాత్ర చేయాలని చంద్రబాబు పార్టీ శ్రేణులను ఆదేశించారు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలకు టీడీపీ అంతగా ప్రాధాన్యత ఇవ్వదు. అయితే ఈసారి ఏపీలో పరిస్థితులను భిన్నంగా ఉండటం.. తమ స్థానాన్ని దక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుండటంతో టీడీపీ వ్యూహం మార్చింది. హిందూత్వ నినాదంతో తమ బలాన్ని పెంచుకోవాలని భావిస్తున్న బీజేపీ బలపడితే.. అది తమకే నష్టం కలిగిస్తుందన్న భావనలో టీడీపీ ఉంది.
ఈ కారణంగానే తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ధర్మ పరిరక్షణ యాత్ర చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలను ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే ఈ యాత్రలకు పోలీసులు ఎంతవరకు అనుమతి ఇస్తారన్నది తెలియాల్సి ఉంది. నిజానికి ఏపీలో టీడీపీ పరిస్థితి ఇప్పుడు భిన్నంగా ఉంది. పైకి బీజేపీని విమర్శించలేని పరిస్థితిలో ఉన్న టీడీపీ.. అంతర్గతంగా మాత్రం ఆ పార్టీతో తమకు ఎక్కువ ఇబ్బందులు వస్తాయనే భావనలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి బీజేపీ వ్యూహాలకు టీడీపీ అధినేత చంద్రబాబు సైలెంట్‌గా చెక్ చెబుతున్నట్టు అర్థమవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.