‘కేసీఆర్ కావాలా... చంద్రబాబు కావాలా’… టీడీపీ సరికొత్త నినాదం

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ పాలన కేసీఆర్ చేతుల్లోకి వెళ్లిపోతుందని ఆరోపించిన చంద్రబాబు... రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ వర్సెస్ టీడీపీగా జరగనున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: March 9, 2019, 3:57 PM IST
‘కేసీఆర్ కావాలా... చంద్రబాబు కావాలా’… టీడీపీ సరికొత్త నినాదం
కేసీఆర్, చంద్రబాబు (File)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి పెరుగుతున్న వేళ... మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. తాజాగా డేటా చోరీ కేసు వ్యవహారంలో వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీ కలిసి టీడీపీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తున్న చంద్రబాబు... తాజాగా ఈ కేసు వైసీపీ, టీఆర్ఎస్ కుట్రలో భాగమే అంటూ పలు ఆధారాలను మీడియా ముందుకు తెచ్చారు. చంద్రబాబు బయటపెట్టిన ఆధారాలు నిజమేనా ? కాదా ? అనే అంశం పక్కనపెడితే... రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఏ నినాదంతో ముందుకు వెళుతుందనే అంశంపై టీడీపీ అధినేత స్పష్టత ఇవ్వడం విశేషం.

తాజాగా జరిగిన మీడియా సమావేశంలో వివిధ అంశాలపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు... ఈ సారి ఎక్కువగా ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ కంటే ఎక్కువగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టార్గెట్ చేశారు. ఒకవేళ జగన్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ పాలన కేసీఆర్ చేతుల్లోకి వెళ్లిపోతుందని ఆరోపించిన చంద్రబాబు... రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ వర్సెస్ టీడీపీగా జరగనున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఆడించినట్టుగా ఆడే వ్యక్తిగా మారిపోయారని ధ్వజమెత్తారు. ఏపీలో జగన్ అధికారంలోకి వస్తే కేసీఆర్‌కు కప్పం కట్టాల్సి వస్తుందనే వ్యాఖ్యలు చేయడం ద్వారా టీఆర్ఎస్ అధినేతకు వైసీపీ చీఫ్ సామంతరాజుగా ఉండాల్సి వస్తుందన్నారు. అంటే తెలంగాణకు ఏపీ సామంతరాజ్యంగా మారిపోతుందనే వ్యాఖ్యలు చేశారు.

అయితే సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను బట్టి చూస్తే... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్నే ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు అమలు చేయబోతున్నట్టు అర్థమవుతోంది. తెలంగాణలో మళ్లీ ఆంధ్రా పెత్తనం అవసరమా ? అంటూ చంద్రబాబును బూచిగా చూపించడంలో కేసీఆర్ విజయం సాధించారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ టీఆర్ఎస్, టీడీపీ మధ్య అన్నట్టు చిత్రీకరించడంలో సక్సెస్ సాధించిన కేసీఆర్... కాంగ్రెస్ గురించి ప్రజలు ఎక్కువగా పట్టించుకోకుండా చేయడంలో సఫలీకృతులయ్యారు.

తాజాగా చంద్రబాబు కూడా ఏపీలో టీడీపీ పోటీ కేసీఆర్‌తోనే అని చెప్పడం వెనుక అసలు కారణం... ప్రధాన ప్రతిపక్షం వైసీపీని ప్రజలు పట్టించుకోకుండా చేయడమే అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇకపై ఆయన ప్రధాని నరేంద్రమోదీ కంటే ఎక్కువగా కేసీఆర్‌ను టార్గెట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి కేసీఆర్ కావాలా... చంద్రబాబు కావాలా అనే టీడీపీ నినాదానికి కౌంటర్‌గా వైసీపీ ఏం చేస్తుందో చూడాలి. ఇది ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అని కామెంట్ చేయడం ద్వారా.. గతంలో కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవం నినాదాన్ని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లారో.. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే బాటలో పయనిస్తున్నట్టు కనిపిస్తోంది.
First published: March 9, 2019, 3:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading