MP Galla Jaydev: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీలలో గల్లా జయదేవ్ (Galla Jayadev) ఒకరు. వైసీపీ స్వింగ్‌లోనూ.. వరసగా రెండోసారి గుంటూరు (Guntur) నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. విభజన హామీలపై లోక్‌సభలో ప్రధాని మోదీ (Prime minster Modi)ని మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని సంభోదించి బాగానే పాపులారిటీ సంపాదించారు జయదేవ్. టీడీపీ రాష్ట్రంలో అధికారం కోల్పోయినా కొంతకాలం దూకుడుగా వెళ్లిన ఆయన… ఇప్పుడు పూర్తిగా నల్లపూసై పోయారు. గుంటూరులో అడ్రస్ లేరు.. టీడీపీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. జయదేవే కాదు.. ఆయన తల్లి గల్లా అరుణకుమారి సైతం ఉలుకు లేదు పలుకు లేదు. దీంతో వారికేమైంది? ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? అనేది చర్చగా మారింది. ఇటీవల బోసడీకే అంటూ టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలను వేడెక్కించాయి. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆఫీసులపై దాడులు జరిగాయి. ఈ ఎపిసో డ్‌లో చంద్రబాబు (Chandra Babu) ఏపీ టీడీపీ ఆఫీస్‌లో 36 గంటలపాటు దీక్ష చేశారు. ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలిసి వచ్చారు. కానీ ఎక్కడా గల్లా జయదేవ్ మాట వినిపించలేదు.. మనిషి కనిపించలేదు. దాడులను ఖండిస్తూ ప్రకటన లేదు. చంద్రబాబు దీక్షకు రాలేదు. చంద్రబాబుతోపాటు ఢిల్లీ వెళ్లిన బృందంలోనూ జయదేవ్ లేరు. టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన బెజవాడ ఎంపీ కేశినేని నాని (MP Kesaneni Nani) మాత్రం మనసు మార్చుకుని చంద్రబాబు దీక్షకు వచ్చారు.. మాట్లాడారు. పార్టీ అధినేతతో కలిసి ఢిల్లీ వెళ్లారు.
యాక్టివ్ పాలిటిక్స్ కు దూరమయ్యారా..? పార్టీ మారుతున్నారా..? అమరరాజా సంస్థ గల్లా కుటుంబానిదే. తండ్రి రామచంద్రనాయుడు నుంచి పూర్తిస్థాయిలో వ్యాపార బాధ్యతలు స్వీకరించి అమరరాజా సీఎండీ అయ్యారు జయదేవ్. ఇటీవలే అమరరాజా సంస్థను సమస్యలు చుట్టుముట్టాయి. కాలుష్యాన్ని వెదజల్లుతోందని ప్రభుత్వం కన్నెర్ర చేయడంతో పొల్యూషన్ బోర్డు అధికారులు వరసగా నోటీసులు జారీ చేశారు. కాలుష్యం కారణంగా చుట్టుపక్కల గ్రామాల్లోని నీరు కలుషితం అవుతోందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆరోపణ. ఈ వివాదం సంస్థ క్లోజర్ నోటీసులు ఇచ్చే వరకు వెళ్లింది. దీంతో హైకోర్టు తలుపు తట్టింది అమరరాజా సంస్థ. అక్కడ ఊరట లభించింది.
ఆ వివాదం అలా ఉండగానే సొంతూరు చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం దిగువమాఘంలో గల్లా కుటుంబంపై భూఆక్రమణ కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామాలు గల్లా కుటుంబాన్ని కలిచి వేసినట్టుగా చెబుతున్నారు. రాజకీయాల్లో ఉండటం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని గల్లా ఫ్యామిలీ ఫీల్ అవుతున్నట్టు సమాచారం. అందుకే యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరమైనట్టు ప్రచారం జరుగుతోంది. మరికొంతమంది మాత్రం ఆయన బీజేపీ గూటికి చేరుతున్నారంటూ ప్రచారం చేస్తున్నారు.
ఇదీ చదవండి: దీపావళి సంబరాలపై ఆంక్షలు.. గ్రీన్ క్రాకర్స్‌తో జరుపుకోవాలని ప్రభుత్వం సూచన
టీడీపీ కేడర్‌తోనూ టచ్‌లో లేని జయదేవ్..
సోషల్ మీడియాలో ఎంపీ జయదేవ్ పోస్టింగ్స్ లేవు. టీడీపీతోనూ అంటీముట్టనట్టు ఉంటున్నారు. చంద్రబాబు నుంచి పార్టీ కేడర్ వరకు ఎవరితోనూ ఎంపీ టచ్‌లో లేరని టాక్. ఈ క్రమంలోనే టీడీపీ ఆఫీసులపై దాడి.. చంద్రబాబు దీక్ష.. ఢిల్లీ టూర్‌లకు జయదేవ్ దూరంగా ఉన్నారని సమాచారం. జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమా ప్రమోషన్‌లో జయదేవ్ బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. కారణం ఏదైనా.. అరుణకుమారి టీడీపీ పొలిట్‌బ్యూరో నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవడం.. జయదేవ్ సైలెంట్ కావడంతో వారి రాజకీయ భవిష్యత్ వ్యూహం ఏంటన్నది ప్రశ్నగా మారింది. ఈ విషయంలో గల్లా జయదేవ్ కదలికలేంటో కాలమే చెప్పాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Chandrababu Naidu, Jayadev Galla, Kesineni Nani, TDP