శాసనమండలి రద్దుపై టీడీపీ కౌంటర్ వ్యూహం...

టీడీపీ ఎమ్మెల్సీలు రేపు (ఈనెల 14న) ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. శాసనమండలి రద్దు అంశంపై కేంద్ర మంత్రులను కలసి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.

news18-telugu
Updated: February 13, 2020, 4:06 PM IST
శాసనమండలి రద్దుపై టీడీపీ కౌంటర్ వ్యూహం...
చంద్రబాబుతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలి రద్దు అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశాన్ని ఢిల్లీ స్థాయిలో చర్చకు పెట్టేందుకు టీడీపీ ఎమ్మెల్సీలు సిద్ధమయ్యారు. టీడీపీ ఎమ్మెల్సీలు రేపు (ఈనెల 14న) ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. శాసనమండలి రద్దు అంశంపై కేంద్ర మంత్రులను కలసి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసే ఆలోచనలో టీడీపీ ఎమ్మెల్సీ లు ఉన్నట్టు సమాచారం.

మరోవైపు ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ ఖరారు కావడంతో... సీఎం జగన్ ఢిల్లీ టూర్ ఖరారైంది. నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమైన సీఎం జగన్... ఆయనతో అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. గంటన్నరపాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు పలు రాజకీయ అంశాలపై కూడా సీఎం జగన్ ప్రధాని మోదీకి వివరణ ఇచ్చారు. నేడు ఢిల్లీలోనే ఉండి హోంమంత్రి అమిత్ షాను జగన్ కలుస్తారని ప్రచారం జరిగింది. అయితే అమిత్ షా అపాయింట్ మెంట్ ఖరారు కాకపోవడంతో ఆయన విజయవాడకు తిరుగుపయనమయ్యారు.

అయితే రేపు అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇవ్వడంతో... మరోసారి ఢిల్లీ వెళ్లి ఆయనతో చర్చలు జరపనున్నారు ఏపీ సీఎం జగన్. అమిత్ షాతో జగన్ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మండలి రద్దు, కర్నూలుకు హైకోర్టు తరలింపు వంటి అంశాల్లో ముందుగా నిర్ణయం తీసుకోవాల్సింది హోంశాఖే కావడంతో... అమిత్ షాతో జగన్ భేటీ కీలకమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం శాసనమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58 కాగా, అందులో తెలుగుదేశం పార్టీ నుంచి 26 మంది, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నుంచి తొమ్మిది మంది ఉన్నారు. ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) నుంచి ఐదుగురు, బీజేపీ నుంచి ముగ్గురు, స్వతంత్రులు ముగ్గురు, నామినేటెడ్ సభ్యులు ఎనిమిది మంది ఉన్నారు. నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

First published: February 13, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు