news18-telugu
Updated: February 15, 2019, 10:19 AM IST
మాగుంట శ్రీనివాసులురెడ్డి(Image Facebook)
ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీని వీడి వైసీపీలో చేరడంతో... ఈ బాటలో ఇంకెవరు నడుస్తారనే అంశంపై ఏపీ రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే మరో ముగ్గురు నలుగురు నాయకులు పార్టీని వీడే అవకాశం ఉందని పార్టీ నేతలకు వివరించిన చంద్రబాబు... అలాంటి వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. కానీ... పార్టీని వీడే వారి జాబితాలో ప్రకాశం, నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత, టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కూడా ఉన్నారనే ప్రచారం ఆ పార్టీ వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది.
ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న మాగుంట శ్రీనివాసులురెడ్డి... తన అనుచరులతో నెల్లూరులో సమావేశం నిర్వహించారు. దీనికి ముందుగానే ఆయన పలు సర్వేలు కూడా చేయించుకున్నారని తెలుస్తోంది. దీంతో ఆయన తన పోటీకి సంబంధించి సర్వే రిపోర్టుల ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారని... ఈ కారణంగానే అనుచరులతో సమావేశమయ్యారని ఒంగోలు, నెల్లూరు రాజకీయవర్గాల్లో ప్రచారం జోరందుకుంది. మాగుంట అనుచరులు కొందరు ఆయనను వైసీపీ తరపున ఒంగోలు నుంచి పోటీ చేయాలని కోరుతుంటే... మరికొందరు మాత్రం టీడీపీ తరపున నెల్లూరు ఎంపీగా బరిలోకి దిగాలని సూచిస్తున్నట్టు సమాచారం.
అయితే ఈ విషయంలో ఆయన మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఈ సమావేశం జరుగుతున్న సమయంలోనే చంద్రబాబు నుంచి మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఫోన్ వచ్చిందని... అమరావతి వచ్చిన తనను కలవాలని ఆయనను చంద్రబాబు కోరినట్టు ప్రచారం జరుగుతోంది. ఆర్థికంగా బలమైన నాయకుడు కావడంతో... మాగుంట శ్రీనివాసులురెడ్డి పార్టీని వీడకుండా చూడాలని టీడీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మాగుంట శ్రీనివాసులురెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ? టీడీపీకి షాక్ ఇచ్చి వైసీపీలో చేరిపోతారా ? అన్నది ఆసక్తికరంగా మారింది.
Published by:
Kishore Akkaladevi
First published:
February 15, 2019, 9:35 AM IST