విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పొగడ్తలు

చంద్రబాబునాయుడు నమ్మి వారిని రాజ్యసభకు పంపితే ఆయన గొంతు కోశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పార్టీ కోసం పనిచేస్తే ఆ పార్టీ విధానాలకు కట్టుబడి ఉండాలని అన్నారు.

news18-telugu
Updated: June 21, 2019, 4:08 PM IST
విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పొగడ్తలు
విజయసాయిరెడ్డి, బుద్ధా వెంకన్న (File)
  • Share this:
ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అంటే టీడీపీలో ఫైర్ బ్రాండ్. టీడీపీని ఎవరైనా తిడితే తన మాటల తూటాలతో ఎదురుదాడి చేస్తుంటారు. వైసీపీ అంటే ఒంటికాలి మీద లేస్తారు. అలాంటి బుద్ధా వెంకన్న విజయసాయిరెడ్డిని మెచ్చుకోవడం విశేషం. ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పార్టీ మారిన రాజ్యసభ ఎంపీల మీద ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. బీజేపీలో చేరిన నలుగురు ఎంపీల్లో టీజీ వెంకటేష్ మినహా.. మిగిలిన ముగ్గురు కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేని దద్దమ్మలు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబునాయుడు నమ్మి వారిని రాజ్యసభకు పంపితే ఆయన గొంతు కోశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పార్టీ కోసం పనిచేస్తే ఆ పార్టీ విధానాలకు కట్టుబడి ఉండాలని అన్నారు. ఈ సందర్బంగా విజయసాయిరెడ్డి మీద ప్రశంసలు కురిపించారు.

‘ఆ నలుగురు ఎంపీల కంటే విజయసాయిరెడ్డి నయం. ఓ కమిట్ మెంట్ ఉంది. జగన్ వల్ల జైలుకు వెళ్లాల్సి వచ్చినా కూడా విజయసాయిరెడ్డి ఆయన వెంటే ఉన్నారు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా నిలబడ్డారు. అలా ఉండాలి. అంతే కానీ, పార్టీ ఓడిపోగానే వేరే కండువా కప్పుకోవడం నీచం.’ అని బుద్ధా వెంకన్న అన్నారు. విజయసాయిరెడ్డి, జగన్ మీద గతంలో బుద్ధా వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు టీడీపీలో ఈ పరిస్థితికి రావడానికి చంద్రబాబు తీరు కూడా కారణమని బుద్ధా వెంకన్న ఆరోపించారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అది చంద్రబాబునాయుడు చేసిన తప్పు అని బుద్ధా వెంకన్న అన్నారు.

First published: June 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు