కారెక్కిన మరో టీడీపీ ఎమ్మెల్యే.. కేసీఆర్‌తో భేటీ..టీఆర్ఎస్‌లో టీడీఎల్పీ విలీనం

ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు

కొద్దిసేపటికి క్రితమే టీడీపీ ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరరావు సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. అధికారికంగా టీఆర్ఎస్‌లో చేరారు.

 • Share this:
  తెలంగాణలో అతి కష్టం మీద తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. తెలంగాణ అసెంబ్లీలో ఆ పార్టీకి మిగిలిన ఒకే ఒక్క ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేశారు. కొద్దిసేపటికి క్రితమే ఆయన సీఎం కేసీఆర్‌తో సమావేశమై.. అధికారికంగా టీఆర్ఎస్‌లో చేరారు. టీడీపీ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి లేఖ అందించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి స్పీకర్‌కు మచ్చ నాగేశ్వరరావు లేఖను అందించారు. ఈ సందర్భంగా ఆయన శాసనసభా వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డితోనూ సమావేశమయ్యారు. దీంతో మ‌రికాసేప‌ట్లో టీడీఎల్పీ విలీనంపై అధికారిక బులిటెన్ జారీ కానున్నట్టు తెలుస్తోంది.

  రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో క్రమంగా టీడీపీ క్రమంగా బలహీనపడుతూ వస్తోంది. 2014లో 15 మందికిపైగా ఎమ్మెల్యేలను గెలిపించుకున్నప్పటికీ.. వారిలో మెజార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరిపోవడంతో ఆ పార్టీ శాసనసభాపక్షం గతంలోనూ టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనమైంది. ఇక 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో రెండు సీట్లను మాత్రమే టీడీపీ గెలుచుకుంది. సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేట నుంచి మచ్చా నాగేశ్వరరావు టీడీపీ తరపున గెలిచారు.

  వారిలో సండ్ర వెంకటవీరయ్య చాలాకాలం క్రితమే టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అయితే మచ్చా నాగేశ్వరరావు మాత్రం టీడీపీలో కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు ఆయన కూడా టీఆర్ఎస్‌లో చేరిపోవడంతో మరోసారి టీడీఎల్పీ టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం కావడం లాంఛనమైంది. త్వరలోనే ఖమ్మం మున్సిపల్ ఎన్నికలు జరగనుండటం సహా పలు రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావును టీఆర్ఎస్ ఆకర్షించినట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
  Published by:Kishore Akkaladevi
  First published: