TDP Leaders meets Gorantla Butchaiah: టీడీపీ సీనియర్ నేత.. విదేయుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిజంగానే రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారా.. ఇప్పటికే దానికే కట్టు బడి ఉన్నారా.. లేక డ్రామా ఆడుతున్నారా.. ప్రస్తుతం తెలుగు తమ్ముళ్లను వెంటాడుతున్న ప్రశ్న ఇది. గతంలో ఇలా చాలాసార్లు ఆయన అధిష్టానంపై అలగడంతో.. ఈ సారి డ్రామా చేస్తున్నారేమో అని తెలుగుతమ్ములు లైట్ తీసుకుంటున్నారు.. కానీ ఈ సారి మాత్రం ఆయన పార్టీ నుంచి తప్పుకోడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. దీంతో విషయాన్ని సద్దుమణిగేలా చేయడానికి.. అధిష్టాన బృందం గోరంట్లతో చర్చలు జరిపింది. చంద్రబాబు ఆదేశాలతో ముగ్గురు నేతలు గోరంట్ల ఇంటికి వెళ్లారు. చిన్నరాజప్ప, జవహర్, గద్దె రామ్మోహన్ ముగ్గురు కలిసి బుచ్చయ్యతో సమావేశం అయ్యారు. రాజమండ్రి సిటీలో సీనియర్ నేత ఆదిరెడ్డి అప్పారావుతో గోరంట్లకు విభేదాలు ఉన్న నేపథ్యంలో వాటి పరిష్కారానికి చర్చలు జరుపుతున్నారు. చంద్రబాబును కలవబోనని, త్వరలోనే అన్నీ చెబుతానని నిన్న ప్రకటించారు బుచ్చయ్య. దీంతో అధిష్టానం ముగ్గురు నేతలను ఆయన ఇంటికి పంపింది. అయితే, రాజీనామాపై బుచ్చయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. గంటన్నర పాటు త్రిసభ్య బృందం చర్చలు సాగాయి. బయటకు ఏం చెపుతున్నా.. గోరంట్ల పార్టీలో కోనసాగేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. పార్టీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని.. ఇప్పుడు చర్చలు అవసరం లేదని ఆయన తెగేసి చెప్పినట్టు సమాచారం..
ఈ సమావేశం తరువాత టీడీపీ నేత గద్దె రామ్మోహన్రావు మీడియాతో మాట్లాడారు. బుచ్చయ్యచౌదరితో సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. రాజమండ్రి టీడీపీలో ఇబ్బందులపై గోరంట్ల చెప్పారని, ఆయన డిమాండ్లను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని అయన అన్నారు. ఈ విషయంపై రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వయంగా జోక్యం చేసుకుంటారని గద్దె రామ్మోహన్రావు పేర్కొన్నారు. త్వరలో పార్టీలో నెలకొన్న విబేధాలు సర్ధుమణుగుతాయని ఆయన వెల్లడించారు.
బుచ్చయ్యచౌదరి పార్టీ అధిష్ఠానం తీరుపై గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. దీంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇదే క్రమంలో తన ఎమ్మెల్యే పదవికి, పార్టీ పదవికి వారం రోజుల్లో రాజీనామా చేస్తానని సన్నిహితుల వద్ద చెప్పడం పార్టీలో కలకలం రేపింది. తక్షణమే రంగంలోకి దిగిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు ఫోన్‌చేసి 20 నిమిషాలు మాట్లాడారు. చంద్రబాబు ఆదేశాలతో బుచ్చయ్య చౌదరిని బుజ్జగించేందుకు టీడీపీ త్రిసభ్య బృందం ఆయనను కలిసింది. టీడీపీ బృందంలో మాజీమంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, జవహర్, గద్దె రామ్మోహన్ ఉన్నారు. రాజమండ్రి అర్బన్‌లో బుచ్చయ్యచౌదరి చెబుతున్న పేర్లను పరిశీలనలోకి తీసుకోవడంతో పాటు ఆదిరెడ్డి అప్పారావు, బుచ్చయ్యచౌదరి మధ్య విభేదాలను తొలగించాలని టీడీపీ హైకమాండ్ ఆదేశించింది.
ఇక 2019లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడినా.. ఆయన మాత్రం రాజమండ్రి రూరల్ నుంచి విజయం సాధించారు. అప్పటి నుంచి పార్టీ తరపున వైసీపీ ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతల తీరు, ఇతర అంశాలపై ప్రభుత్వాన్ని, అధికార పార్టీని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఐతే పార్టీలో తనకు సరైన గుర్తింపు లేకపోవడమే కాకుండా.. పార్టీ కమిటీలు, ఇతర నిర్ణయాలపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ వీడనునట్లు వార్తలు వస్తున్నాయి. ఐతే ఆయన ఏ పార్టీలో చేరుతారు..? ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనేదానిపై స్పష్టత లేదు. వేరే పార్టీలో చేరుతారా..? లేక రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటారా..? అనేది తెలియాల్సి ఉంది.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.