TDP MLA CLARITY ON HIS RESIGNATION RUMORS AND MP VIJAYASAI REDDY COMMENTS NGS
Municipal elctions: విజయసాయిరెడ్డి అబద్ధమాడారా..? రాజీనామాపై గంటా ఏమన్నారు?
గంటా శ్రీనివాసరావు (ఫైల్ ఫోటో)
ఏపీలో ఎవరు పార్టీ మారినా కచ్చితంగా గంటా ప్రస్థావన వస్తుంది. అయితే ఈ సారి స్వయంగా విజయసాయి రెడ్డే స్పష్టత ఇచ్చారు. గంటా తమ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అయితే గంటా మాత్రం తాను రాజీనామా చేస్తే అందరికీ చెప్పే చేస్తాను అంటున్నారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా రాజీనామా మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. విశాఖలోని గంటా ప్రధాన అనుచరుడు కాశీ విశ్వనాథ్ వైసీపీలో చేరడంతో ఈ ప్రచారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇంతకాలం ఆయన గంటాకు కుడి భుజంలా వ్యవహరించారు. ముఖ్యంగా కార్యకర్తలు.. నియోజకవర్గాల్లో కేడర్ సమస్యలు.. గంటా శ్రీనివాసరావకు సంబంధించి అన్ని విషయాలను కాశీవిశ్వనాథ్ చూసుకునే వారు. అలాంటి అతడు ఇప్పుడు వైసీపీలోకి చేరడంతో గంటా కూడా త్వరలోనే పార్టీ మారుతున్నారంటూ కథనాలు వెలువడ్డాయి..
ఆ ప్రచారాలకు తోడు ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు కూడా గంటా పార్టీ మారుతున్నట్టు క్లారిటీ ఇచ్చినట్టు అయ్యింది. గంటా శ్రీనివసారావు పార్టీ మారుతున్నారన్న అన్న ప్రశ్నకు విజయసాయిరెడ్డి నేరుగా సమాధానం చెప్పారు. సీఎం జగన్ రాష్ట్రంలో అమలు చేస్తున్నసంక్షేమ పథకాలకు చాలామంది ఆకర్షితులవుతున్నారని.. చాలామంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని.. గంటా శ్రీనివాస రావు కూడా అధిష్టానం ముందు కొన్ని ప్రతిపాధనలు పెట్టారని.. అయితే ఆ ప్రతిపాదనలకు పార్టీ అధ్యక్షుడు ఆమోదం తెలపాలని.. అలా జరిగితే గంటా కూడా తమ పార్టీకి వస్తారని.. ఆయన వస్తామంటే మేం ఎందుకు వద్దంటమంటూ వ్యాఖ్యానించారు.
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చూస్తే గంటా పార్టీ మారే ప్రయత్నాలు చేశారు అన్నది స్పష్టమవుతోంది. సీఎం జగన్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు కాబట్టే ఇంకా ఆయన పార్టీ మారలేదని.. ఒకవేళ అధిష్టానం ఒకే చెబితే గంటా నేడో రేపో వైసీపీలో చేరడం ఖాయమని.. అది కూడా మున్సిపల్ ఎన్నికల ముందే ఆయన చేరిక ఉంటుందని గంటా అనుచరులు కూడా విశాఖలో ప్రచారం మొదలెట్టారు..
ఆయనపై వస్తున్న ప్రచారాన్ని మరోసారి గంటా ఖండించారు. తాను టీడీపీ వీడుతున్నట్టు 100 సార్లు ప్రచారం జరిగిందని.. అయినా అందులో నిజం లేదన్నారు. తాను అలా చేయాలి అనుకుంటే ధైర్యంగా అందరికీ చెప్పే చేస్తాను అన్నారు. 2019 తరువాత తన నియోజకవర్గంలో చాలామంది పార్టీ మారారని.. అందులో కాశీ ఒక్కరని అభిప్రాయపడ్డారు. తాను ప్రతిపాదనలు పెట్టాను అని అంటున్న విజయసాయి రెడ్డి.. ఆ ప్రతిపాదనలు కూడా ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ పార్టీ మారాల్సి వస్తే నేరుగా చంద్రబాబును కలిసి చెప్పేంత స్వేచ్ఛ తనకు ఉందన్నారు గంటా..
గంట శ్రీనివాసరావు వ్యాఖ్యలు బట్టి చూస్తే విజయసాయిరెడ్డి మరి అబద్ధమాడారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.. విజయసాయి రెడ్డి చెప్పింది నిజం అయితే గంటా అబద్ధమాడినట్టే కదా అంటూ మరికొందరు నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు. ఏది ఏమైనా మరోసారి గంటా రాజీనామా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.