• Home
 • »
 • News
 • »
 • politics
 • »
 • TDP MAHANADU ON ZOOM APP FIRST DAY HIGHLIGHTS OF CHANDRABABU NAIDU SPEECH BA

Mahanadu Day 1 | తొలిరోజు మ‌హానాడు సాగిందిలా...

టీడీపీ మహానాడులో పాల్గొన్న చంద్రబాబు, పార్టీ ముఖ్యనేతలు

టీడీపీ మహానాడులో ఈరోజు ఐదు తీర్మానాలు ఆమోదం పొందాయి. రేపు ఐదు తీర్మానాలపై చర్చ జరపనున్నారు.

 • Share this:
  టీడీపీ మ‌హానాడు అంటే పార్టీ నేత‌ల‌కు ఒక పండుగ. సాధార‌ణంగా మూడు రోజుల‌పాటు నిర్వ‌హించే ఈ స‌భ‌లు కొన్ని ప్ర‌త్యేక సందర్భ‌ాల్లో రెండు రోజులు కూడా నిర్వ‌హించారు. అయితే ఇప్పుడు తెలుగు త‌మ్ముళ్ల పండుగ ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండానే సాదాసీదాగా ప్రారంభ‌మైంది. కోవిడ్ 19 కార‌ణంగా ఈ ఏడాది తెలుగుదేశం మ‌హానాడు ఇంత‌కుముందెన్న‌డు లేని విధంగా జూమ్ యాప్‌ లో నిర్వ‌హించారు. తొలుత పార్టీ జెండా ఆవిష్క‌ర‌ణ‌తో ప్రారంభ‌మైన మ‌హానాడు ఐదు తీర్మానాలు ఆమోదించ‌డంతో మొద‌టి రోజును పూర్తి చేసుకొంది. మ‌హానాడు ప్రారంభం కాగానే విశాఖ‌ప‌ట్నం ఎల్జీ పాలిమర్స్ మృతుల‌కు సంతాపం తెలిపారు. త‌రువాత రెండు తెలుగు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు ప్ర‌సంగించారు. దీంతోపాటు ఐదు తీర్మానాలును ఈ రోజు పార్టీ మ‌హానాడు ఆమోదించింది. అవి, విద్యుత్ ఛార్జీల పెంపు - మాట త‌ప్పిన జ‌గ‌న్, క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ వ‌ల‌స కార్మికుల క‌ష్టాలు, అరాచ‌క పాల‌న‌కు ఏడాది - ప్ర‌మాదంలో ప్ర‌జాస్వామ్యం, అన్న‌దాత వెన్ను విరిచిన జ‌గ‌న్, తెలంగాణ కు సంబంధించి ఒక తీర్మానాన్ని మ‌హానాడు ఆమోదించింది. స‌మావేశంలో పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు మాట్లాడుతూ చివరకు బ్లీచింగ్ పౌడర్ లో కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వం అవినీతికి పాల్పడ్డార‌ని మండిప‌డ్డారు. వైసీపీ పాలనలో విపరీతమైన అవినీతి చోటుచేసుకుంటోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. కరోనా వైరస్ కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. కరోనాకు పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ సరిపోతుందని నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పారు. చివరకు బ్లీచింగ్ పౌడర్ లో కూడా అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు.  దేశంలో ఎక్కడా లేని దారుణమైన మద్యం బ్రాండ్లు ఏపీలో ఉన్నాయని చంద్రబాబు విమర్శించారు. మహానాడు సందర్బంగా టీడీపీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రాథమిక హక్కులు లేవని... ఆటవిక రాజ్యం కొనసాగుతోందని అన్నారు. విశాఖలో కేంద్ర ఉద్యోగి ఒకరిని పులివెందుల రౌడీలు బెదిరిస్తున్నారని చెప్పారు. టీడీపీ హయాంలో విద్యుత్ ఛార్జీలను పెంచలేదని... వైసీపీ ప్రభుత్వం వచ్చాక అన్నీ పెంచేస్తున్నారని విమర్శించారు.

  వైసీపీ ఏడాది పాలనపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏడాది పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. 70 శాతం పూర్తైన పోలవరం ప్రాజెక్టును ఆపేశారని మండిపడ్డారు. పట్టిసీమ నీటిని కృష్ణా డెల్టాకు ఇచ్చి, కృష్ణా నీటిని రాయలసీమకు ఇచ్చేందుకు తాము చేపట్టిన పనులను కూడా ఆపేశారని దుయ్యబట్టారు. అమరావతిని కొనసాగించి ఉంటే ఎన్నో ఉద్యోగాలు వచ్చేవని అన్నారు. కృష్ణా-గోదావరి-పెన్నా ప్రాజెక్టును కూడా పక్కన పెట్టేశారని తెలిపారు. జగన్ పాలన మొత్తం అవినీతిమయం, భూకబ్జాలేనని ఆరోపించారు. ఆరోగ్యసేతు యాప్ తయారు చేసిన విశాఖకు చెందిన వ్యక్తిపై భూమి రిజిస్ట్రేషన్ చేయాలంటూ పులివెందుల నుంచి వచ్చిన కొందరు దౌర్జన్యం చేశారని అన్నారు. ఆవ, రాజమండ్రి భూములు కబ్జా చేస్తున్నారని... గుడివాడలో 63 మంది భూములను ఇచ్చేయాలంటూ ఒక మంత్రి బలవంతం చేస్తున్నారని మండిపడ్డారు. చివరకు ఇలాంటి సంక్షోభ సమయంలో కూడా టీటీడీ భూములు అమ్మేందుకు సిద్ధమయ్యారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. సింహాచలంలో భూములు కబ్జా చేశారని, విజయవాడ కనకదుర్గ గుడిలో అవినీతి జరిగిందని, బిల్డ్ ఏపీ పేరుతో రాష్ట్రాన్ని అమ్మేయాలనుకుంటున్నారని విమర్శించారు.

  కరోనాపై కూడా జగన్ ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టించేందుకు ఒక అవకాశం ఇవ్వాలని అడిగారా? అని ముఖ్యమంత్రి జగన్ పై చంద్రబాబు మండిపడ్డారు. ప్రజావేదికను కూల్చడం నుంచి తాజాగా విజయనగరంలో మూడు లాంతర్లను కూల్చేంత వరకు కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు. విపక్ష నేతలపై దాడులు చేయడం, తప్పుడు కేసులు బనాయించడం చేస్తున్నారని దుయ్యబట్టారు. చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునిస్తే... తనను కూడా గృహ నిర్బంధం చేశారని మండిపడ్డారు చంద్ర‌బాబు.

  ఐదు తీర్మాన‌లు ఆమోదం, వాటిపై చ‌ర్చ అనంత‌రం తొలిరోజు మ‌హానాడు ముగిసింది. రేపు మ‌రో ఐదు తీర్మానాల‌పై చ‌ర్చ జ‌రిపిన త‌రువాత వాటిని ఆమోదించి పార్టీ అధ్యక్షుడు చివ‌రి ఉపాన్యాసంతో ఈ ఏడాది మ‌హానాడు ముగియ‌నుంది.

  Published by:Ashok Kumar Bonepalli
  First published: