అసెంబ్లీలో వైసీపీ దూకుడును తట్టుకోలేకపోతున్న టీడీపీ..

ఏపీ అసెంబ్లీలో టీడీపీ పరిస్ధితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఓవైపు ఘోర పరాజయ భారం మర్చిపోకముందే మరోవైపు అసెంబ్లీలో ప్రతీరోజూ ఎదురవుతున్న అవమానాలను తట్టుకుంటూ ముందుకు సాగడం ఆ పార్టీ నేతలకు కష్టతరంగా మారింది. ప్రభుత్వం తరఫున అవసరమున్నా లేకపోయినా వైసీపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా టీడీపీపై విరుచుకుపడదామా అన్నట్లుగా పరిస్ధితి తయారవుతుండటం నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన టీడీపీకి ఇబ్బందికరంగా మారింది.

news18-telugu
Updated: June 18, 2019, 11:58 AM IST
అసెంబ్లీలో వైసీపీ దూకుడును తట్టుకోలేకపోతున్న టీడీపీ..
చంద్రబాబు, వైఎస్ జగన్ (File)
news18-telugu
Updated: June 18, 2019, 11:58 AM IST
(సయ్యద్ అహ్మద్-న్యూస్18,అమరావతి కరస్పాండెంట్)

1983 ఎన్నికల్లో విజయంతో ఏపీ రాజకీయ తెరపైకి అరంగేట్రం చేసిన టీడీపీకి చరిత్రలో ఎన్నడూ లేని స్ధాయిలో కష్టకాలం దాపురించింది. ఓవైపు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయ భారం వెంటాడుతుండగా.. మరోవైపు ప్రాజెక్టులతో పాటు గత ఐదేళ్లలో కుదుర్చుకున్న పలు కాంట్రాక్టులను తిరగదోడే పనిలో వైసీపీ ప్రభుత్వం బిజీగా ఉండటం టీడీపీకి చిక్కులు తెచ్చిపెడుతోంది. అదే సమయంలో అసెంబ్లీలో అధికార వైసీపీ నుంచి ఎదురవుతున్న సవాళ్లను తట్టుకోవడం టీడీపీకి కష్టతరంగా మారింది. స్వయంగా టీడీఎల్పీ నేతగా ఉన్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం వైసీపీ నేతలపై ఏ విమర్శ చేయాలన్నా ఆలోచనలో పడుతున్న తీరు ఆ పార్టీ భవిష్యత్తుపై సందేహాలు రేకెత్తిస్తోంది.

వైసీపీ తరఫున కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారితో పాటు సీనియర్లు సైతం ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును లక్ష్యంగా చేసుకుంటున్నారు. గత ఐదేళ్లలో ఆయన పదేపదే ప్రచారం చేసుకున్న పలు అంశాలను టార్గెట్ చేస్తూ వైసీపీ నేతల ప్రసంగాలు సాగిపోతున్నాయి. నలభయ్యేళ్ల అనుభవంతో మొదలుపెడితే రాజధాని గ్రాఫిక్స్ వరకూ ప్రతీ అంశాన్ని వైసీపీ నేతలు తమ ప్రసంగంలో భాగంగా చేసుకుంటున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విపక్ష నేతగా ఉన్న జగన్ సహా వైసీపీ నేతలు ఏం మాట్లాడినా వారికి అనుభవం లేదంటూ, అవగాహనారాహిత్యంతో విమర్శలు చేస్తున్నారంటూ టీడీపీ విమర్శలు చేసేది. దానికి తగినట్లుగానే స్పీకర్ కోడెల కూడా విపక్ష సభ్యుల మైక్‌లు కట్ చేసే వారు. సీన్ కట్ చేస్తే ప్రస్తుతం స్పీకర్ స్ధానంలో ఉన్న తమ్మినేని సీతారాం ఎక్కడా మైక్ కట్ చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.

టీడీపీ నేతలు ఒక్క విమర్శ చేస్తే చాలు మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఒక్కొక్కరిగా వారిపై విమర్శల దాడి చేస్తున్నారు. గతంలో మీరేం చేశారంటూ పదే పదే చంద్రబాబు అనుభవాన్ని గుర్తుచేస్తున్నారు. సహజంగానే ప్రత్యర్ధి పార్టీలపై చమక్కులు విసిరే సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు చంద్రబాబు లక్ష్యంగా చేస్తున్న విమర్శలు సభలో సభ్యులకు అవసరమైన వినోదాన్ని సైతం పంచుతున్నాయి. అయినా టీడీపీ ఏమీ మాట్లాటలేని పరిస్ధితి. దీనికి ఓ కారణం టీడీపీ సంఖ్యాబలమైతే.. మరో కారణం ఏం విమర్శ చేస్తే వైసీపీ నుంచి ఎలాంటి ఎదురుదాడి ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయమే అనిపిస్తోంది. దీంతో టీడీపీ నేతలు సాధ్యమైనంత మౌనంగా ఉండేందుకే ప్రాధాన్యమిస్తున్నారు.ఈసారి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నేటితో ముగియనున్నాయి.. దీంతో ఈ ఒక్కరోజు ఎలాగైనా గడిపిస్తే చాలు వచ్చే సెషన్ కోసం ప్రత్యేక వ్యూహాలతో సిద్ధం కావచ్చని టీడీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ బడ్డెట్ సమావేశాలు ఎక్కువ రోజులు సాగే అవకాశం ఉండటంతో వైసీపీని ఎదుర్కొనేందుకు పకడ్బందీగా సిద్ధం కావాలని చంద్రబాబు తన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసే పరిస్ధితి నెలకొంది.
First published: June 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...