ఆ రెండు విషయాలో చంద్రబాబు ‘ష్.. సైలెన్స్..’ నేతల అసంతృప్తి

కోట్ల రూపాయలు వెచ్చించి కట్టుకున్న తమ నిర్మాణాలను వైసీపీ ప్రభుత్వం కూల్చివేస్తున్నా... చంద్రబాబు ఎలాంటి ప్రకటనా చేయకుండా మౌనం వహించడంపై టీడీపీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

news18-telugu
Updated: August 23, 2019, 7:49 PM IST
ఆ రెండు విషయాలో చంద్రబాబు ‘ష్.. సైలెన్స్..’ నేతల అసంతృప్తి
చంద్రబాబు (File)
  • Share this:
ఏపీలో టీడీపీకి సీనియర్ నేతల నివాసాలు, అతిధి గృహాలను అక్రమ కట్టడాలుగా నిర్ధారించి అధికారులు కూల్చివేస్తున్నారు. మరోవైపు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించాల్సిన అసెంబ్లీ సామాగ్రిని మధ్యలో ఇంటికి తీసుకెళ్లిన కేసు నడుస్తుండగానే.... ఆయన ఇంట్లో కంప్యూటర్లను వైసీపీ ఆఫీసులో పనిచేసే ఓ ఉద్యోగి ఎత్తుకెళ్లాడు. వాస్తవంగా అయితే ఇంత కంటే చిన్న విషయాలకు సైతం టీడీపీ అధినేత చంద్రబాబు కానీ, ఆయన కుమారుడు లోకేష్ కానీ తీవ్రంగా స్పందించే వారు. ప్రెస్ మీట్ల రూపంలోనో, ప్రకటనల రూపంలోనో, ట్వీట్ల రూపంలోనో తమ ఆగ్రహాన్ని, అభిప్రాయాన్ని వెళ్లగక్కేవారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్ధితి కనిపించకపోవడం సదరు నేతలతో పాటు పార్టీ వర్గాలను సైతం విస్మయపరుస్తోంది.

రెండు నెలల క్రితం వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో కనీసం ఆరునెలలైనా సమయం ఇచ్చి విమర్శల దాడి ప్రారంభించాలని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. సీఎం జగన్ దూకుడు నేపథ్యంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. మొన్నటి కృష్ణానది వరదలైనా, పీపీఏలు, పోలవరం వివాదాలైనా, ఇతరత్రా సమస్యలైనా చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న ఓ వ్యవహారంపై మాత్రం ఆయన మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. అదేమిటంటే టీడీపీ నేతల అక్రమ కట్టడాల కూల్చివేత వ్యవహారం. ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన ఈ కూల్చివేతల వ్యవహారం రాష్ట్రంలో టీడీపీ సీనియర్ నేతల అతిథి గృహాలు, అపార్ట్ మెంట్ల వరకూ పాకింది. గత నెలలో విశాఖ జిల్లాకు చెందిన అనకాపల్లి టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణకు చెందిన అపార్ట్ మెంట్ కు నోటీసులిచ్చి కూల్చివేతకు దిగిన అధికారులు, తాజాగా విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు చెందిన గెస్ట్ హౌస్ సైతం కూల్చివేతకు సిద్ధమయ్యారు. అయినా పార్టీ అధినేత చంద్రబాబు ఎక్కడా స్పందిస్తున్న దాఖలాలు లేవు.

కోట్ల రూపాయలు వెచ్చించి కట్టుకున్న తమ నిర్మాణాలను వైసీపీ ప్రభుత్వం కూల్చివేస్తున్నా... చంద్రబాబు ఎలాంటి ప్రకటనా చేయకుండా మౌనం వహించడంపై టీడీపీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అధికారంలో ఉన్నప్పుడు చింతమనేని ప్రభాకర్, బండారు సత్యానందమూర్తి వంటి నేతలు దాడులు చేసినా చూసీ చూడనట్లుగా వదిలేసిన చంద్రబాబు...అధికారం కోల్పోయి డీలా పడిన పరిస్ధితుల్లో తమకు మద్దతుగా నిలవకపోవడాన్ని గంటా శ్రీనివాస్, పీలా గోవింద్ వంటి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అదే సమయంలో సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ వ్యవహారంపైనా చంద్రబాబు ఎక్కడా మాట్లాడటం లేదు. టీడీపీలో సీనియర్ నేతగా, గతంలో హోంమంత్రిగా కూడా పనిచేసిన కోడెల గత ప్రభుత్వంలో స్పీకర్ గా పనిచేశారు. టీడీపీ అధికారంలో ఉండగా... కోడెల కుటుంబ సభ్యులు చేసిన అరాచకాలపై ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు నమోదు కాగా.. తాజాగా హైదరాబాద్ నుంచి అమరావతి తరలిస్తున్న అసెంబ్లీ సామాగ్రిని తన క్యాంపు కార్యాలయానికి తరలించుకుపోయినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయినా ఈ వ్యవహారంపైనా చంద్రబాబు ఎక్కడా స్పందించిన దాఖలాలు లేవు. చివరికి ఆయన ఇంట్లో కంప్యూటర్లను వైసీపీ అఫీసు ఉద్యోగి దొంగిలించిన వ్యవహారంలోనూ ఇప్పటివరకూ అధినేత స్పందించలేదు. అదే సమయంలో పార్టీలో తనకు వ్యతిరేకంగా గ్రూపులు కడుతున్న వారిపైనా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపైనా మాజీ స్పీకర్ లో అసంతృప్తి కనిపిస్తోంది. మరోవైపు కోడెల పార్టీ పరువు తీశారంటూ టీడీపీ నేత వర్లరామయ్య చేసిన వ్యాఖ్యలు సైతం ఆయనలో అసహనాన్ని పెంచుతున్నాయి. చివరికి ప్రెస్ మీట్లు పెట్టుకుని తనను తాను సమర్ధించుకోవాల్సిన పరిస్దితి తలెత్తినట్లు కోడెల వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా.. చంద్రబాబు మౌనం మాత్రం ఎవరికీ అర్ధం కావడం లేదు. అధికారంలో లేని సమయాల్లో తమకు అండగా ఉండాల్సిన అధినేత మౌనాన్ని ఆశ్రయించడం సరికాదని వారు తమ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)

First published: August 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు