Andhra Pradesh: చంద్రబాబుకు వరుస షాక్ లు. అధిష్టానంపై యుద్ధం ప్రకటించిన తెలుగు తమ్ముళ్లు? టీడీపీలో ఏం జరుగుతోంది?

చంద్రబాబు నాయుడు (ఫైల్ ఫొటో)

పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం పెను దుమారం రేపుతోంది. అధిష్టానం ఎన్నికలను బహిష్కరించామని చెబుతుంటే? పార్టీ లీడర్లు మాత్రం ప్రచారంలో దూసుకుపోతున్నారు. దీంతో ఏం జరుగుతోందో తెలియక కొందరు తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు.

 • Share this:
  ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు టీడీపీలో తుపాను రాజేశాయి. అధిష్టానం ఎన్నికలు వద్దంటోంది. ఇప్పటికే ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. స్వయంగా చంద్రబాబే ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. తాజాగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం అదే మాట చెప్పారు. పరిషత్ ఎన్నికలపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అన్నారు. వేరో ఆలోచనకు తావే లేదని స్పష్టం చేశారు.

  ఇటు అధినేత చంద్రబాబు, అటు టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం చెప్పినా.. జిల్లాల్లో పరిస్థితి వేరేగా ఉంది. పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి తిరుతామంటున్నారు వివిధ జిల్లాల్లో నేతలు. ఇప్పటికే సీనియర్ నేతలు అశోక్ గజపతి రాజు, జ్యోతుల నెహ్రూ లాంటి వారు బహిరంగంగానే ఈ ప్రకటన చేశారు. మరికొందరు బయటకు ఏం మాట్లాడకపోయినా సైలెంట్ గా పరిషత్ ఎన్నికలకు సిద్ధమైపోయారు. ఆయా జిల్లాల్లో అభ్యర్థులు ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు.

  ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయట్లేదని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు చేసిన సంచలన ప్రకటనతో పలువురు తెలుగు తమ్ముళ్లలో తీవ్ర అసంతృప్తి పెరిగింది. గుంటూరు జిల్లా మంగళగిరి, గోదావరి జిల్లాల్లో పలుచోట్ల తాము బరిలోకి దిగి తీరుతామని నేతలు చెబుతున్నారు. పోటీలో కొనసాగాలని నిర్ణయం తీసుకొని ప్రచార రంగంలోకి కూడా దూకుతున్నారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. నందివాడ మండల టీడీపీ జడ్పీటీసి అభ్యర్థి దాసరి మేరీ విజయ కుమారి టీడీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను అధిష్టానంకు పంపారు కూడా. ఆ వెంటనే మంత్రి కొడాలి నాని సమక్షంలో వైసీపీలో చేరారు. జిల్లా పరిషత్ ఎన్నికలు బహిష్కరిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మాత్రమే తాను పార్టీ వీడుతున్నాను అన్నారు ఆమె. మేరీతో పాటు, పలువురు టీడీపీ నాయకులు, ద్వితియ శ్రేణి నేతలు, కార్యకర్తలకు వైసీపీ కండువాలు కప్పిన మంత్రి.. పార్టీలోకి ఆహ్వానించారు.

  ఇక చందర్లపాడు మండలం, ముప్పాళ్ళలో అయితే నేరుగా టీడీపీ పరిషత్ ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. ప్రస్తుతం టీడీపీ ఆర్థికంగా దెబ్బతిందని.. అందుకే చంద్రబాబు ఎన్నికలను బహిష్కరించారని అభ్యర్థి నల్లాని రజనీ అన్నారు. స్థానికంగా గ్రామస్తుల అభిప్రాయం మేరకు ప్రచారం చేస్తున్నానని, దీన్ని చంద్రబాబు మాటను ధిక్కరించినట్టు కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థిని గెలిపించి గిఫ్ట్‌గా ఇస్తామని  ఆమె అన్నారు. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకున్నామని, ఇప్పుడు ఎంపీటీసీ అభ్యర్థిగా గెలిపించుకుని చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇస్తామన్నారు రజనీ.

  దాదాపు చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దీంతో అధిష్టానం మనసు మార్చుకుంటుందని స్థానిక నేతలు భావిస్తున్నారు. ఆయా మండల్లాల్లో పరిస్థితులను బట్టి ఎక్కడైనా పోటీలో కొనసాగాలని టీడీపీ నేతలు భావిస్తే, దానికి అభ్యంతరం చెప్పకూడదని పార్టీ నాయకత్వం పునరాలోచన చేస్తుంది అంటున్నారు లీడర్లు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే పార్టీ కీలక నేతలు ఒక ప్రకటన చేస్తే..  పార్టీలో సీనియర్ నేతలు మరో మాట చెబుతుండడంతో  అంతా గందరగోళంగా మారింది.
  Published by:Nagesh Paina
  First published: