TDP Vs Jr NTR : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇటీవల ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు (Nara Chandrababu naidu) సతీమణి నారా భువనేశ్వరి (Nara bhuvaneswari)పై అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో వెక్కి వెక్కి ఏడ్చారు. దీంతో చంద్రబాబు నాయుడు.. ఆయన కుటుంబానికి భారీగా మద్దతు లభించింది. సినిమా ఇండస్ట్రీ పెద్దలు అంతా చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. సోనూ సూద్, రజనీకాంత్ లాంటి వారు సైతం చంద్రబాబును పరామర్శించారు. ఇక ఇతర రాజకీయ పార్టీలు సైతం చంద్రబాబుకు అండగా వ్యాఖ్యలు చేశాయి. వైసీపీ తీరును తప్పు పట్టారు. అయితే ఈ ఘటనపై నందరమూరి ఫ్యామిలీ అంతా భువనేశ్వరికి అండగా నిలిచింది. మరోవైపూ జూనియర్ ఎన్టీఆర్ సైతం స్పందించారు. అయితే ఆయన మాట్లాడుతూ.. తాను నందమూరి కుటుంబ సభ్యుడిగా మాట్లాడడం లేదని.. ఒక కొడుకుగా.. తండ్రిగా.. మాట్లాడుతున్నాను అన్నారు..
అయితే జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పలువురు టీడీపీ అభిమానులు సెటైర్లు వేశారు. కానీ టీడీపీ నేతలు నేరుగా మాట్లాడలేదు. తాజాగా టీడీపీ నేతలు వర్ల రామయ్య, బుద్ధ వెంకన్నలు సంచలన వ్యాఖ్యలు చేశారు.. నారా భువనేశ్వరిపై కొడాలి నాని, వల్లభనేని వంశీ విమర్శలు చేస్తే ఎన్టీయార్ స్పందించిన తీరు సరిగా లేదని వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు. భువనేశ్వరి మేనల్లుడిగా ఎన్టీయార్ విఫలమయ్యారని విమర్శించారు. మేనత్తను నోటికొచ్చినట్లు అంటే మేనల్లుడిగా ఆయన సరిగ్గా స్పందించలేదని రాష్ట్రం మొత్తం అనుకుంటోందని వర్ల రామయ్య తెలిపారు. సినిమాల కోసం కుటుంబాన్ని, నైతిక విలువలలను వదులుకుంటారా? అని వర్ల రామయ్య నిలదీశారు.
వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో వర్ల రామయ్య దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలపై జూనియర్ ఎన్టీయార్ స్పందించిన తీరును తప్పు పట్టారు. అలాగే నందమూరి హరికృష్ణ గురించి కూడా ప్రస్తావించారు. హరి కృష్ణ బతికే ఉంటే.. ఇంకో రకంగా ఉండేది అన్నారు. సీతయ్య(హరికృష్ణ) బతికుంటే నేరుగా రంగంలోకి దిగేవారన్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు అలా చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. మీ నాన్నకు చెల్లెలు అయినప్పుడు మీకు అత్తే కదా?.. మీ మేనత్తను అంటే ఇలాగేనా స్పందించేది? అంటూ వర్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోలో జూనియర్ స్పందన వింటే.. ప్రవచనాలు చెప్పినట్లు ఉందన్నారు. ఆ వీడియో చూసి పిల్లలు కూడా నవ్వారని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు.
జూనియర్ ఎన్టీఆర్పై వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు సరైనవే అని టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా సమర్ధించారు. చంద్రబాబు కుటుంబానికి వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలంటూ విజయవాడలో వర్ల రామయ్య చేస్తున్న దీక్షకు టీడీపీ నేతలు సంఘీభావం తెలిపారు. జూనియర్పై తమ మనసులో ఉన్న మాటలనే... వర్ల రామయ్య బయట పెట్టారన్నారు. జూనియర్ వ్యాఖ్యలు చూసి వైసీపీ నాయకులు ఏంటి జూనియర్ ఇలా మాట్లాడారు అని అనుకుంటున్నారని విమర్శలు.. నిజంగానే ఆయన వ్యాఖ్యలు చూస్తే ప్రవచనాలు చెప్పినట్లు, సుభాషితలు పలికారని మండిపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Jr ntr, TDP