ఏపీ రాజధాని అమరావతిపై సినిమా... నెల రోజుల్లో విడుదల

అమరావతి అంశంపై సినిమా తీసేందుకు ఓ మహిళ నేత సిద్దమయ్యారు.

news18-telugu
Updated: February 12, 2020, 9:18 AM IST
ఏపీ రాజధాని అమరావతిపై సినిమా... నెల రోజుల్లో విడుదల
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో అమరావతి ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఏపీలో మూడు రాజధానులు వద్దంటూ 55 రోజులకు పైగా అమరావతి రైతులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అమరావతియే ముద్దంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి అంశంపై సినిమా తీసేందుకు ఓ మహిళ నేత సిద్దమయ్యారు. టాలీవుడ్ అగ్రనటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన హైకోర్టు న్యాయవాది చందోలు శోభారాణి, ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత టీడీపీలో చేరారు. ఆ తర్వాత కూడా ఆమె క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవల మళ్లీ తెరపైకి వచ్చిన ఆమె.. ఏపీ పరిణామాలపై స్సందించారు. అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా నిలుస్తామన్నారు.

తాజాగా, శోభారాణి ఓ కీలక ప్రకటన చేశారు. టీడీపీ నేత, సినీ నటి దివ్యవాణితో కలిసి ‘అమరావతి నా రాజధాని’ పేరుతో సినిమా నిర్మించనున్నట్టు తెలిపారు. ఉద్యమంలో జరుగుతున్న వాస్తవ ఘటనల ఆధారంగా నెల రోజుల్లోనే చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేస్తామన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆమెపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజధాని రైతుల పోరాటానికి జగన్ తలవంచక తప్పదన్నారు శోభారాణి.

ఇప్పటికే 50 రోజులకు పైగా రాజధాని అమరావతిలో రైతులు... రాజధానిని తరలించవద్దని పదే పదే కోరుతున్నారు. ర్యాలీలు, నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఎన్ని చేస్తున్నా, ఏం చేస్తున్నా ప్రభుత్వం తాము అనుకున్న ప్రకారం చేసుకుపోతోంది. టీడీపీ లాంటి ప్రతిపక్ష పార్టీలు అమరావతి రైతుల్ని పక్కదారి పట్టిస్తున్నాయనీ, తాము రాజధానిని విశాఖ, అమరావతి, కర్నూలులో మూడు చోట్ల అభివృద్ధి చేస్తామని అంటోంది. అందులో భాగంగానే ఇటీవల కర్నూలుకు రెండు కీలక విభాగాల్ని తరలించింది. మరిన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

First published: February 12, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు