ఏపీ అసెంబ్లీ ఎన్నికల తరువాత టీడీపీ నుంచి బీజేపీలోకి వలసలు జోరందుకున్న సంగతి తెలిసిందే. ఎప్పుడు ఏ నాయకుడు టీడీపీ నుంచి బీజేపీలోకి వెళతారో టీడీపీ నేతలకు కూడా అర్థంకావడం లేదు. టీడీపీలోని నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ పెద్దలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన మహిళా నాయకురాలు కూడా త్వరలోనే కమలం గూటికి చేరొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధికారంలోకి ఉన్నప్పుడు ఆ పార్టీ తరపున తన వాయిస్‌ను బలంగా వినిపించిన సాదినేని యామిని... త్వరలోనే బీజేపీలో చేరే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
కొంతకాలంగా ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణతో యామిని చర్చలు జరుపుతోందని... త్వరలోనే ఆమె బీజేపీలో చేరనుందని గుంటూరు జిల్లా రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు వైసీపీ, బీజేపీని విమర్శించడంలో టీడీపీ కీలక నేతలతో పోటీపడ్డ సాదినేని యామిని... ఎన్నికల్లో గుంటూరు అసెంబ్లీ స్థానాన్ని ఆశించారు. తన సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండే స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు.
అయితే ఆ సీటును టీడీపీ మరో నేతకు కేటాయించడంతో ఆమె నిరాశ చెందారు. ఎన్నికల తరువాత జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో... యామిని కూడా బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి టీడీపీ తరపున తన వాయిస్‌ను బలంగా వినిపించిన యామిని... బీజేపీలో చేరితే ఆ పార్టీ తరపున ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తారనడంలో సందేహం లేదు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.