AP Panchayat Elections: టీడీపీకి షాక్.. సీనియర్ నేత గుడ్ బై?

ప్రతీకాత్మక చిత్రం

వైసీపీలో చేరేందుకు రెడీ అయిన పితాని సత్యనారాయణ తనకు పాలకొల్లు టికెట్ ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. ఆచంటలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీరంగనాథ రాజు ఉన్నారు. దీంతో పాలకొల్లు ఇవ్వాలని కోరుతున్నట్టు సమాచారం.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు ముందు టీడీపీకి గట్టి షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ టీడీపీకి గుడ్ బై కొట్టనున్నట్టు తెలిసింది. పంచాయతీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు రెడీ అవుతున్న నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పితాని సత్యనారాయణ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కనీసం ఆయన పార్టీ కార్యకర్తలను కూడా కలిసేందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. ఆయన పార్టీ మారేందుకు రెడీ అయ్యారని, వైసీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారని పశ్చిమగోదావరి జిల్లాలో ప్రచారం జరుగుతోంది. పితాని సత్యనారాయణకు దగ్గరగా ఉండే నేతలు కూడా ఇదే విషయం చెవులు కొరుక్కుంటున్నారు. అయితే, వైసీపీ నుంచి మాత్రం ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. ఎన్నికల సమయం వరకు సైలెంట్‌గా ఉండాలని, ఎన్నికల టైమ్‌లో ఆయనకు వైసీపీ కండువా కప్పేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని సమాచారం. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికలకు ఆయన పూర్తిగా దూరంగా ఉండనున్నట్టు తెలుస్తోంది.

    పశ్చిమ గోదావరి జిల్లా కొమ్ముచిక్కాల గ్రామానికి చెందిన పితాని సత్యనారాయణ మొదట కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2014 సంవత్సరంలో టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచి చంద్రబాబు కేబినెట్‌లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఆచంట నుంచి ఓడిపోయారు. అక్కడ పితాని మీద గెలిచిన చెరుకువాడ శ్రీరంగనాథ రాజుకు జగన్ కేబినెట్‌లో మంత్రిపదవి కూడా దక్కింది.

    వైసీపీలో చేరేందుకు రెడీ అయిన పితాని సత్యనారాయణ తనకు పాలకొల్లు టికెట్ ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. ఆచంటలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీరంగనాథ రాజు ఉన్నారు. దీంతో పాలకొల్లు ఇవ్వాలని కోరుతున్నట్టు సమాచారం. దీని మీద వైసీపీ అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ రాలేదు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో దీనికి సంబంధించిన చర్చ మరోసారి మొదలైంది. జగన్ నుంచి టికెట్ మీద హామీ లభించిన వెంటనే ఆయన వైసీపీ కండువా కప్పుకోవడం ఖాయంగా సమాచారం.

    ఏపీలో టీడీపీని దెబ్బకొట్టేందుకు అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష బీజేపీ కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. మొదట వైసీపీ చాలా దూకుడుగా వ్యవహరించి టీడీపీ నేతలను తమ వైపునకు తిప్పుకొంది. ఇక బీజేపీ కూడా అప్పుడప్పుడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. టీడీపీ నేతలకు ఆపరేషన్ కమలం ద్వారా తమ వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలుచేస్తోంది. జగన్‌ నుంచి సమస్యలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలను తమ వైపునకు తిప్పుకొనేందుకు ప్లాన్ చేస్తోంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: