ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. మే 5 నుంచి ప్రారంభం కావాల్సిన పరీక్షలను హైకోర్టు జోక్యంతో వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇప్పుడు పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలన్న డిమాండ్ కూడా తెరపైకి వస్తోంది. పదో తరగతి పరీక్షలను రద్దు చేసి, విద్యార్థులను పాస్ చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. మరో 3 వారాల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉన్నందున కోవిడ్ తీవ్రత దృష్ట్యా విద్యార్థులందరినీ పాస్ చేయాలని కోరారు. పొరుగున ఉన్న తెలంగాణ సహా దేశంలోమరో 12రాష్ట్రాలు ఇప్పటికే పదో తరగతి పరీక్షల్ని రద్దు చేశాయని గుర్తుచేశారు. పలుసార్లు విద్యార్థులు, తల్లిదండ్రులతో నిర్వహించిన అన్లైన్ సమావేశాల్లో కోవిడ్ భయానికి తోడు పరీక్షల పట్ల ఎంత ఒత్తిడికి లోనవుతున్నారో తన దృష్టికి తీసుకొచ్చినట్లు లోకేష్ తన లేఖలో పేర్కొన్ను.
కోవిడ్ మహమ్మారి ఎప్పుడు తగ్గుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయన్న లోకేష్.., స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ చూడని ప్రత్యేక పరిస్థితుల్ని మన భవిష్యత్తు తరం చూడాల్సి వస్తోందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 5వేల కరోనా యాక్టివ్ కేసులు ఉన్నప్పుడు గత ఏడాది పదో తరగతి పరీక్షలు రద్దు చేశారని.., రాష్ట్రంలో ఇప్పుడు 2 లక్షలకు పైగా యాక్టివ్ కేసులున్నాయన్నారు. వేలాది కేంద్రాల్లో 6.7 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవటం ఎంతో ప్రమాదకరమని లోకేష్ తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు భయపడే పరీక్షల నిర్వహణపై సమయాన్ని వృథా చేయొద్దని విజ్ఞప్తి చేశారు. పరీక్షలు నిర్వహించరాదనే విద్యార్థుల, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆలోచనలకు ప్రాధాన్యం ఇచ్చి పరీక్షల రద్దు నిర్ణయం ప్రకటించాలని.., విద్యార్థులను వెంటనే పాస్ చెయ్యాలని డిమాండ్ చేశారు. హైకోర్టు లేదా ప్రతిపక్ష నాయకులు ఆందోళనలతో కాకుండా మానవత్వంతో ఆలోచించి వెంటనే రద్దు చేస్తూ నిర్ణయం ప్రకటించాలని లోకేష్ సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరారు.
పదో తరగతి పరీక్షలను రద్దు చేసి, విద్యార్థులను పాస్ చేయాలని ముఖ్యమంత్రి @ysjagan గారికి లేఖ రాసాను. మరో 3 వారాల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉన్నందున కోవిడ్ తీవ్రత దృష్ట్యా విద్యార్థులందరినీ పాస్ చేయండి.(1/4) pic.twitter.com/yTmJRiyplr
మరోవైపు ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. టెన్త్ ఎగ్జామ్స్ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పరీక్షలకు ఇంకా మూడు వారాల గడువుంది. ప్రస్తుతం రాష్ట్రంలో సెమీ లాక్ డౌన్ అమలవుతోంది. ఈ మూడు వారాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడితే పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపే అవకాశముంది. కేసులు పెరిగితే అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెసుస్తోంది. మరి ప్రభుత్వం లోకేష్ డిమాండ్ ను పరిగణలోకి తీసుకుంటుందో లేదో వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.