గత ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి కంటే ఎక్కువగా మంగళగిరిలో నారా లోకేశ్ ఓటమి చవిచూడటం టీడీపీ శ్రేణులకు, చంద్రబాబుకు షాక్ ఇచ్చింది. తొలిసారి మంగళగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన నారా లోకేశ్.. ఆ తరువాత మంగళగిరిని వదిలేసిన మరో నియోజకవర్గంలో పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. ఎన్నికల్లో ఓడిపోయిన మొదట్లో మంగళగిరిని పెద్దగా పట్టించుకోని నారా లోకేశ్.. ఆ తరువాత మాత్రం మంగళగిరిలో తరచూ పర్యటించడం మొదలుపెట్టారు. అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. ప్రజల సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళుతున్నారు. దీంతో నారా లోకేశ్ మరోసారి మంగళగిరి నుంచే పోటీ చేస్తారనే విషయంలో టీడీపీ శ్రేణులకు ఓ క్లారిటీ వచ్చింది. ఓడిపోయిన స్థానం నుంచే గెలిచి అసెంబ్లీకి వెళ్లాలనే పట్టుదలతో ఉన్న నారా లోకేశ్.. మంగళగిరి ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో లోకేశ్ గెలుపు కోసం ఎంతగానో కృషి చేసిన స్థానిక టీడీపీ నేత గంజి చిరంజీవి.. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసే అవకాశం వస్తుందని ఆశించారు. కానీ నారా లోకేశ్ మరోసారి మంగళగిరి నుంచే పోటీ చేయాలని డిసైడ్ కావడంతో.. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై క్లారిటీ ఇవ్వాలని గంజి చిరంజీవి యువనేతను అడిగారట. ఇందుకు నారా లోకేశ్ గంజి చిరంజీవిని పద్మశాలి ఓటర్లు ఎక్కువగా ఉండే ప్రకాశం జిల్లా చీరాల నుంచి పోటీ చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. చీరాలలో తన సొంత సామాజికవర్గం ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ.. గతంలో ఇదే సామాజికవర్గం నుంచి పోటీ చేసిన పోతుల సునీత ఓడిపోయారు.
పోతుల సునీతపై ఆమంచి కృష్ణమోహన్ విజయం సాధించారు. అయితే కష్టపడితే అక్కడ కచ్చితంగా విజయం సాధించవచ్చని లోకేశ్ గంజి చిరంజీవికి సూచించినట్టు సమాచారం. గంజి చిరంజీవి సైతం ఇప్పటికే చీరాలలో పలుసార్లు పర్యటించారని తెలుస్తోంది. అక్కడ ప్రస్తుతం ఉన్న టీడీపీ నేత బాలాజీకి పార్టీ నాయకత్వం ఏ విధంగా న్యాయం చేస్తుందన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే మంగళగిరికి చెందిన గంజి చిరంజీవి.. చీరాల రాజకీయాల్లో రాణిస్తారా ? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం అక్కడ టీడీపీ తరపున గెలిచిన కరణం బలరాం ఉన్నారు. ఆయన తన కుమారుడితో కలిసి వైసీపీకి జై కొట్టారు. అయితే కరణం బలరాం, ఆమంచి కృష్ణమోహన్‌కు మధ్య విభేదాలను క్యాష్ చేసుకోవాలని టీడీపీ భావిస్తోంది. ఇప్పటి నుంచే అక్కడ ఫోకస్ చేయాలని డిసైడయ్యింది. దీంతో నారా లోకేశ్ ఆ వ్యూహాన్నే అమలు చేస్తున్నారా ? అనే చర్చ కూడా రాజకీయవర్గాల్లో సాగుతోంది. మొత్తానికి నారా లోకేశ్ కోసం వేరే నియోజకవర్గానికి వెళ్లడానికి సిద్ధమైన టీడీపీ నేత ఎంతవరకు సక్సెస్ అవుతారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.