• HOME
 • »
 • NEWS
 • »
 • POLITICS
 • »
 • TDP LEADER DEVINENI UMA DEMANDS FOR CBI INQUIRY ON LAND SCAM IN HOUSE FOR POOR SCHEME BA GNT

YS Jagan meets PM Modi: జగన్ ఢిల్లీ టూర్ వేళ ఆ అంశంపై సీబీఐ విచారణకు టీడీపీ డిమాండ్

YS Jagan meets PM Modi: జగన్ ఢిల్లీ టూర్ వేళ ఆ అంశంపై సీబీఐ విచారణకు టీడీపీ డిమాండ్

ప్రధాని మోదీతో జగన్ భేటీ (File)

‘25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు. కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తామని ప్రగల్భాలు పలికారు. ఢిల్లీ వెళ్లి వ్యక్తిగత పనులు, కేసులు గురించే సీఎం జగన్ చర్చిస్తారు.’అని దేవినేని ఆరోపించారు.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోదీని కలిసిన వేళ టీడీపీ కీలక డిమాండ్ చేసింది. ఏపీలో పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇచ్చే ‘సెంటు భూమి’ కోసం తీసుకునే భూముల వెనుక భారీ కుంభకోణం ఉందని టీడీపీ ఆరోపించింది. కృష్ణా జిల్లా రెడ్డి గూడెం మండలం రుద్రవరం గ్రామంలో జరిగిన పసుపు చైతన్యం కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడారు. ‘సెంటు పట్టా కుంభకోణంలో 40 మంది ఎమ్మెల్యేలు పైగా ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలంతా వెళ్లి జే ట్యాక్స్ ఎందుకు కట్టొచ్చారు?. ఇందులో కొన్ని కోర్టు విచారణలో ఉన్నాయి. దీనిపై సీబీఐ విచారణ జరపాలి.’ అని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. మరోవైపు ఏపీలో అధికార వైసీపీ కేంద్రంలోని అధికార ఎన్డీయేలో చేరేందుకే జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిశారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో టీడీపీ మరోసారి ప్రత్యేక హోదా అంశాన్ని బయటకు తీసింది. ‘25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు. కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తామని ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు కేంద్రానికి మన అవసరం లేదని చేతులెత్తేశారు. నమ్మి గెలిపించిన ప్రజలకు నమ్మక ద్రోహం చేశారు. ఢిల్లీ వెళ్లి వ్యక్తిగత పనులు, కేసులు గురించే సీఎం జగన్ చర్చిస్తారు.’అని దేవినేని ఆరోపించారు. వైసీపీ అవినీతిని అక్రమాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారన్న ఉక్రోషంతోనే టీడీపీ నేతలు కొమ్మారెడ్డి పట్టాభిరామ్, సబ్బం హరి ఇంటిపై దాడులకు పాల్పడుతున్నారన్నారు.

  ‘బాధ్యత గల పదవిలో ఉన్న డిప్యూటీ సీఎంకు అమరావతి రైతులను తిట్టడానికి నోరెలావచ్చింది? ప్రజాస్వామ్యంలో రైతులను పట్టుకొని ఆ బూతులు ఎవరైనా మాట్లాడతారా? లక్షలకు లక్షలు వాలంటీర్లకు చెల్లిస్తూ గ్రామ పంచాయితీల్లో వ్యవస్థలను నిర్వీర్యం చేసి ఏం ఘనకార్యం సాధించారని వాలంటీర్లకు చప్పట్లు కొట్టిస్తున్నారు?. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ బినామీ బావ మరిదిని పెట్టుకొని వందల కోట్లు దోచేస్తున్నారు. పాదయాత్రలో గాని, మేనిఫెస్టోలో గాని, నవరత్నాల్లో గానీ వ్యవసాయ మోటర్లకు మీటర్ల కార్యక్రమం ఉందా? కోట్లకు కక్కుర్తిపడి రైతులకు అన్యాయం చేస్తారా? రైతుల మెడలకు ఉరితాళ్లు బిగిస్తారా? రైతులకు అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదు.’ అని దేవినేని ఉమా హెచ్చరించారు.

  పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీని వైసీపీ ప్రభుత్వం పెద్ద కుంభకోణంగా మార్చిందని టీడీపీ ఆరోపిస్తోంది. భూముల కొనుగోలు, వాటిని మెరక చేయడంలో వైసీపీ నేతలు వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపిస్తోంది. ఉదాహరణకు రాజమండ్రిలో ఆవ భూములు మునిగిపోతాయని ముందే చెప్పినా వినకుండా వందల కోట్లు పోసి కొన్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గతంలో ఆరోపించారు. అలాగే, కావలిలో వైసీపీ నేతల భూ కుంభకోణాలకు భయపడి అధికారులు సెలవులు పెట్టి పారిపోతున్నారన్నారు. మరోవైపు చాలా తక్కువ విలువ చేసే భూములకు రెండు, మూడు రెట్లు ఎక్కువ డబ్బు పెట్టి ప్రభుత్వం భూములు కొంటోందని, దీని వెనుక వైసీపీ నేతలే ఉన్నారని టీడీపీ ప్రధానంగా ఆరోపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాల అవినీతిపై విచారణ జరపాలని టీడీపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. అయినా ప్రభుత్వంలో చలనం లేదని ప్రతిపక్షం ఆరోపిస్తోంది.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: