Home /News /politics /

TDP GIVING TOP PRIORITY TO VANGAVEETI RADHAKRISHNA IN VIJAYAWADA POLITICS AK

Vangaveeti Radha: రూటు మార్చిన వంగవీటి రాధా.. ఈసారి పక్కా ప్లాన్..

వంగవీటి రాధాకృష్ణ( Facebook Image)

వంగవీటి రాధాకృష్ణ( Facebook Image)

Vangaveeti Radhakrishna: వైసీపీ అధికారంలో ఉన్నా.. జనసేన పార్టీలో చేరాలని క్యాడర్ నుంచి ఒత్తిడి వస్తున్నా.. వంగవీటి రాధా టీడీపీలోనే కొనసాగడానికి అసలు కారణం ఇదేనని విజయవాడ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.

    విజయవాడ రాజకీయాల్లో వంగవీటి ఫ్యామిలీకి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. గెలిచినా.. ఓడినా ఆ ఫ్యామిలీకి కాపు సామాజికవర్గంలో ఫాలోయింగ్ అదే విధంగా కొనసాగుతూ వస్తోంది. అయితే వంగవీటి రంగా తనయుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ రాజకీయ ప్రయాణం మాత్రం ఎవరికీ అర్థంకాని విధంగా ఉంటూ వచ్చింది. మొదట కాంగ్రెస్, ఆ తరువాత పీఆర్పీ, ఆ తరువాత వైసీపీలో చేరిన వంగవీటి రాధా... గత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఎన్నికల్లో ఓటమి తరువాత ఆయన మళ్లీ వైసీపీలో చేరతారని వార్తలు వచ్చాయి. కానీ ఆయన మాత్రం టీడీపీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు.

    అయితే విజయవాడ రాజకీయాల్లో వంగవీటి రాధాకు ప్రాధాన్యత పెరగడం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. అమరావతి ఉద్యమానికి వంగవీటి రాధా మద్దతు ఇచ్చారు. గతంలో రద్దయిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తన వాళ్లకు టీడీపీ తరపున టికెట్లు ఇప్పించుకోవడంలో రాధా సక్సెస్ అయ్యారు. ఆయన కోసం పలు స్థానాల్లో సిట్టింగ్‌లను కూడా టీడీపీ పక్కన పెట్టిందనే వాదన ఉంది. దీంతో అసలు వంగవీటి రాధాకు టీడీపీలో ఇంతటి ప్రాధాన్యత ఎలా దక్కిందనే దానిపై విజయవాడ రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

    తన రాజకీయ ప్రయాణంలో అనేక పార్టీలు మారిన వంగవీటి రాధా.. మళ్లీ అలాంటి తప్పు చేయకూడదని 2019 ఎన్నికల తరువాత గట్టిగా నిర్ణయించుకున్నారని సమాచారం. ఇదే విషయాన్ని వైసీపీలో చేరాలని తనను కోరిన మంత్రి కొడాలి నానికి ఆయన కచ్చితంగా చెప్పారట. ఇదే విషయం టీడీపీ అధినాయకత్వం వరకు వెళ్లడంతో... పార్టీలో వంగవీటి రాధాకు ప్రాధాన్యత ఇవ్వాలని.. ఆయన సేవలను పార్టీ కోసం వినియోగించుకోవాలని చంద్రబాబు టీడీపీ ముఖ్యనేతలకు సూచించారని తెలుస్తోంది. అంతేకాదు పార్టీపరంగా ఏ ఇబ్బందులు వచ్చినా.. నేరుగా తనను కలవొచ్చని చంద్రబాబు వంగవీటి రాధాకు చెప్పారని.. ఆ రకంగా చాలామంది నేతల కంటే వంగవీటి రాధాకు విజయవాడ రాజకీయాల్లో ప్రాధాన్యత లభించిందని తెలుస్తోంది.

    అంతేకాదు టీడీపీ యువనేత లోకేశ్ సైతం వంగవీటి రాధాకు అన్ని రకాలుగా ప్రాధాన్యత ఇస్తున్నారని కొందరు టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నా.. జనసేన పార్టీలో చేరాలని క్యాడర్ నుంచి ఒత్తిడి వస్తున్నా.. వంగవీటి రాధా టీడీపీలోనే కొనసాగడానికి అసలు కారణం ఇదేనని విజయవాడ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి మారిన సమీకరణాల నేపథ్యంలో వంగవీటి రాధాకృష్ణ... తన రాజకీయ భవిష్యత్తును టీడీపీలోనే చక్కదిద్దుకోవాలని డిసైడయినట్టు కనిపిస్తోంది. మరి.. టీడీపీలో కీలకంగా మారి మళ్లీ బెజవాడ రాజకీయాల్లో వంగవీటి రాధా కీలకంగా మారతారేమో చూడాలి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Tdp, Vangaveeti Radha, Vijayawada

    తదుపరి వార్తలు