ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో జేసీ బ్రదర్స్ అంటే పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా సీమ రాజకీయాల్లో జేసీ ఫ్యామిలీది ప్రత్యేక స్థానం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారిదే ఆధిపత్యం. ప్రతిపక్షాలపై విమర్శలు చేయడమే కాదు.., అవసరమైతే సొంతపార్టీని కూడా ఏకిపారేయడంలో జేసీ దివాకర్ రెడ్డికి ఎవరూ సాటిరారు. సూటిగా, సుతిమెత్తగా పార్టీ అధిష్టానాన్ని తిట్టాలంటే ఆయన తర్వాతే ఎవరైనా..! కాంగ్రెస్, టీడీపీల హయాంలో సీమలో జేసీ చెప్పిందే వేదం. కానీ వైసీపీ అదికారంలోకి వచ్చిన తర్వాత వారి ఫేట్ మారిపోయింది. పోలీస్ కేసులు, మైనింగ్ క్వారీలు సీజ్, ట్రావెల్స్ సీజ్ వంటి వివాదాలతో జేసీ కుటుంబం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీంతో టీడీపీలో కొనసాగితే ఇక కష్టమని జేసీ బ్రదర్స్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సుదీర్ఘ రాజకీయ చరిత్ర
జేసీ కుటుంబం 1978 నుండి క్రియాశీలక రాజకీయాల్లో వుంది. రాయలసీమలోని అనంతపురం జిల్లా రాజకీయాల్లో జేసీ ఫ్యామిలీకి ఎదురులేదు. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరింది జేసీ కుటుంబం. ఈ విషయంలో జేసీ తనయుడు పవన్ రెడ్డికి జగన్ కి ఉన్న సాన్నిహిత్యాన్ని కాదనుకొని పసుపు జెండాను భుజాన వేసుకుంది. ఐతే ఇటీవల చోటు చేసుకుంటున్న పరిమామాలతో జేసీ బ్రదర్స్ బీజేపీవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వైసీపీ ప్రభుత్వం తమను టార్గెట్ చేయడమే..!
ఆర్ధిక మూలాలపై దాడులు
రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డికి ఏదీ కలిసిరావడం లేదు. సీఎం జగన్ తన వ్యాపారాలను దీబ్బతీస్తున్నారని., ట్రావెల్స్ ని కూడా మూయించేశారని జేసీ దివాకర్ రెడ్డి బహిరంగంగానే ఆరోపించారు. అలాగే జేసీ కుటుంబానికి ప్రధాన ఆర్ధిక వనరులుగా ఉన్న మైనింగ్,సిమెంట్ వ్యాపారాలు, ట్రావెల్స్, ఇతరత్రా వ్యాపారాలు ఇటీవల బాగా దెబ్బతిన్నాయి. జగన్ సీఎం అయిన తరువాత జేసీ కుటుంబానికి చెందిన త్రిశూల్ సిమెంట్ కంపెనీ, మైనింగ్ లకు సంబంధించి వంద కోట్ల జరిమానా విధించటం, చెల్లించక పోతే ఆస్తులు జప్తు చేస్తామని నోటీసు ఇవ్వటం సంచలనం రేపింది. అంతే కాకుండా ట్రావెల్స్ కు సంబంధించి బిఎస్ ౩ వాహనాలను అక్రమంగా బిఎస్ 4గా మార్చారన్న ఆరోపణలపై బస్సులను సీజ్ చేసి ప్రభాకర్ రెడ్డితో పాటు అస్మిత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపించారు.
కేతిరెడ్డితో వివాదం
ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన అనుచరులు దాడి చేయించడం వంటి పరిణామాలతో తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇవన్నీ జేసీ కుటుంబానికి పెద్ద షాక్ గానే భావించవచ్చు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే తమకు కంచుకోట లాంటి తాడిపత్రిని చేజార్చుకునే పరిస్థితులు ఏర్పడతాయనే భావనలో జేసీ బ్రదర్స్ ఉన్నారు. ఈ వేధింపులను తట్టుకొని టీడీపీలో కొనసాగడంపై జేసీ పవన్ కొంత అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది.
ముక్కుసూటితనం
రాజకీయాల్లో ముక్కుసూటి తనానికి మారుపేరు జేసీ దివాకర్ రెడ్డి. ఎవరెన్ని అనుకున్నా ఆయన మాత్రం డైరెక్ట్ గానే మ ట్లాడతారు. గతంలో కూడా టీడీపీ గురించి ఎన్నో వేదికలపై బహిరంగానే విమర్శలు చేశారు. సుతిమెత్తని పాలన సాగించాలంటే కుదరదని మా చేతులు కట్టేశారని గతంలో చంద్రబాబు సమక్షంలోనే విమర్శించిన దివాకర్ రెడ్డి.., జగన్ మావాడేకాని మూర్ఖుడని చాలా సార్లు వ్యాఖ్యానించారు. ఇక ఇటీవలే 70ఏళ్లు పైబడిన నేతలు మాటలతో టైమ్ వేస్ట్ చేస్తున్నారని చంద్రబాబును ఉద్దేశించి పరోక్ష విమర్శలు చేశారు. అలాగే గంటల తరబడి పెట్టే మీటింగులతో ప్రయోజనమేంటని కూడా ప్రశ్నించారు. చంద్రబాబులో మార్పు రావాలని కోరుకున్న జేసీ.., తానే మారిపోవాలని డిసైడ్ అయ్యారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ కూడా జరుగుతోంది.
లోటు పూడ్చేందుకు సిద్ధం
ప్రస్తుతం రాష్ట్రంలో బలపడే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. అందునా రాయలసీమలో రాయలసీమలో కీలక నేతల కొరత ఉంది. సీమ నుంచి ఎంపీలు సీఎం రమేష్, టీజీ వెంకటేష్, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పార్టీలో ఉన్నా.., జేసీ బ్రదర్స్ లాంటి నేతలు లేరు. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకొని మళ్లీ సీమలో పునర్వైభవం సాధించాలని జేసీ వర్గం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తో జేసీ దివాకర్ రెడ్డి సుదీర్ఘ చర్చలు జరపడం ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.