Nandamuri Balakrishna: బాలకృష్ణకు బిగ్ షాక్.. వైసీపీలోకి హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే

బాలకృష్ణ

Nandamuri Balakrishna: ఎన్నికల్లో గెలిచిన తరువాత కూడా హిందూపురం నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన బాలకృష్ణ.. గతంతో పోలిస్తే సొంత నియోజకవర్గంలో ఎక్కువగా పర్యటిస్తున్నారు. ఇక్కడ తన పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

  • Share this:
    గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ హవాను తట్టుకుని గెలిచిన అతి కొద్ది ఎమ్మెల్యేల్లో నందమూరి బాలకృష్ణ. తాను గెలిచి టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తున్న హిందూపురం నియోజకవర్గం టీడీపీ చేజారిపోకుండా చేయడంలో బాలకృష్ణ విజయం సాధించారు. రాయలసీమలో టీడీపీ తరపున గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో బాలకృష్ణ ఒకరు కావడం మరో విశేషం. ఎన్నికల్లో గెలిచిన తరువాత కూడా హిందూపురం నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన బాలకృష్ణ.. గతంతో పోలిస్తే సొంత నియోజకవర్గంలో ఎక్కువగా పర్యటిస్తున్నారు. ఇక్కడ తన పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ హిందూపురం నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ సైతం.. తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించింది. హిందూపురంలోని 38 స్థానాల్లో 30 చోట్ల వైసీపీ మద్దతుదారుల విజయం సాధించారు. ఇది బాలకృష్ణకు కొంత ఇబ్బంది కలిగించే పరిణామమే అనే చర్చ కూడా సాగుతోంది.

    అయితే పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ దూకుడు మరిచిపోకముందే టీడీపీకి హిందూపురంలో మరో షాక్ తగిలింది. హిందూపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత రంగనాయకులు వైసీపీలో చేరారు. వైసీపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ హిందూపురం ఇంఛార్జ్ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత హిందూపురంలో టీడీపీ తరఫున తొలిసారి రంగనాయకులు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో రెండోసారి టీడీపీ నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొంతకాలంగా ఆయన రంగనాయకులు టీడీపీకి దూరంగా ఉంటున్నారు. తనకు టీడీపీలో ప్రాధాన్యత తగ్గిందనే భావనలో రంగనాయకులు ఉన్నట్టు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. రంగనాయకులు ఇద్దరు కుమారులు, అనుచరులు కూడా వైసీపీలో చేరారు. ఇదిలా ఉంటే రంగనాయకులు వైసీపీలో చేరడం టీడీపీ స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఇబ్బంది కలిగించే పరిణామమే అనే చర్చ జరుగుతోంది.

    మరోవైపు ఆయన వైసీపీలో చేరడం వల్ల తమ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని.. ఆయన కొంతకాలంగా పార్టీకి దూరంగానే ఉంటున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే హిందూపురం నియోజకవర్గంపై వైసీపీ సీరియస్‌గా దృష్టి పెట్టిందని.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఈ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో ఉందని చర్చ జరుగుతోంది. ఈ కారణంగానే టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలను ప్రొత్సహిస్తోందనే వాదన కూడా వినిపిస్తోంది. మొత్తానికి హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ రాజకీయ ఎత్తుగడ.. బాలకృష్ణకు షాక్ ఇచ్చిందనే చెప్పాలి.
    Published by:Kishore Akkaladevi
    First published: