AP Panchayat Elections: టీడీపీ అభ్యర్థులకు చంద్రబాబు సూచనలు.. ఎవరి నామినేషన్లైనా తిరస్కరిస్తే ఇలా చేయండి..

చంద్రబాబు నాయుడు (ఫైల్ ఫొటో)

ఆంధ్రప్రదేశ్‌లో తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్లకు నేటితో గడువు ముగిసింది. చివరి రోజు అక్కడక్కడ కొన్ని ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మొత్తం 12 జిల్లాల్లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులుగా 13 వేల మంది నామినేషన్లు వేశారు. వార్డు మెంబర్లకు 32వేలకు పైగా నామినేషన్లు వచ్చాయి.

 • Share this:
  తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పంచాయితీ ఎన్నికల తొలిదశ ప్రాంతాల టీడీపీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘ తొలిదశ పంచాయితీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈ రోజుతో ముగిసింది. టీడీపీ అభ్యర్ధులు, కార్యకర్తలు వీరోచితంగా పోరాడారు. స్ఫూర్తిదాయకంగా పోరాడిన అభ్యర్ధులకు, కార్యకర్తలకు అభినందనలు. వైసీపీ దాడులు, దౌర్జన్యాలను సమర్ధంగా ఎదుర్కొన్నారు. బలవంతపు ఏకగ్రీవాలను చాలావరకు అడ్డుకోగలిగారు. ఉపసంహరణ గడువు ముగిసేదాకా పట్టుదలగా పోరాడాలి. రేపు ఉదయం 8గంటల నుంచి జరిగే నామినేషన్ల స్క్రూటినీకి అభ్యర్ధులంతా హాజరై వైసీపీ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా నామినేషన్లను అక్రమంగా తిరస్కరించి, అభ్యర్ధులకు అన్యాయం చేస్తే, వెంటనే సదరు అధికారుల పేర్లతో సహా, ఏ కారణాలతో తిరస్కరించారో పూర్తి సమాచారాన్ని టీడీపీ కంట్రోల్ రూమ్ కు తెలియజేయాలి. అధికారం అండతో వైసీపీ చేసే దుర్మార్గాలపై రాజీలేని పోరాటం చేయాలి. సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకోవాలి. వైసీపీ దాడులు, దౌర్జన్యాల ఫొటో, వీడియో సాక్ష్యాధారాలను జిల్లా కలెక్టర్ కు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి, టీడీపీ కేంద్ర కార్యాలయానికి పంపాలి. రాక్షస పార్టీతో మనం పోరాటం చేస్తున్నాం అనేది గుర్తుంచుకోవాలి.’ అని చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.

  పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అడుగడుగునా హింస, విధ్వంసాలకు పాల్పడిందని ఆరోపించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరిలో, పెరియంబాడిలో, శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో, సంతబొమ్మాలి మండలంలో, కడప జిల్లా అట్లూరు మండలంలో, తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం గొల్లలగుంటలో, అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం బిఎన్ హళ్లిలో సంఘటనలే నిదర్శనమన్నారు. బాధిత అభ్యర్ధులతో, వారి కుటుంబాలతో తాను మాట్లాడానని, తామంతా ధైర్యంగా ఉన్నామని, వీరోచితంగా పోరాడతామని చెప్పడం స్ఫూర్తిదాయకమన్నారు. తర్వాతి దశల ఎన్నికల్లో కూడా రెట్టించిన స్ఫూర్తి చూపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. వైసీపీ దమనకాండకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. స్థానిక స్వపరిపాలన స్ఫూర్తిని కాపాడాలన్నారు.

  ఆంధ్రప్రదేశ్‌లో తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్లకు నేటితో గడువు ముగిసింది. చివరి రోజు అక్కడక్కడ కొన్ని ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. నామినేషన్ పేపర్లు ఎత్తుకుపోవడం, పోటీ చేసే అభ్యర్థుల కుటుంబసభ్యులను కిడ్నాప్ చేసిన ఘటనలు జరిగినట్టు పార్టీలు ఆరోపించాయి. మొత్తం 12 జిల్లాల్లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులుగా 13 వేల మంది నామినేషన్లు వేశారు. వార్డు మెంబర్లకు 32వేలకు పైగా నామినేషన్లు వచ్చాయి.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: