ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో తిరగి అధికారం చేజిక్కించుకునేందుకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది. కుప్పం నుంచే పార్టీని బలోపేతం చేసేందుకు టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు (Nara Chandra Babu Naidu) సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కుప్పంలో మూడు రోజులపాటు పర్యటిస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇదిలా ఉంటే గత ఏడాది కుప్పంలో పర్యటించిన సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకురావాలని కార్యకర్తలు ఆయన్ను కోరారు. కానీ ఆ సందర్భంగా చంద్రబాబు కనీసం స్పందించలేదు. అప్పట్లో ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాదు.. రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి నేతలు ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఐతే చంద్రబాబు గానీ, లోకేష్ గానీ, బాలకృష్ణ గానీ.. పార్టీలోకి జూనియర్ ఎంట్రీపై స్పందించలేదు. ఆ తర్వాత అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి విషయంలో చోటు చేసుకున్న వివాదంపై ఎన్టీఆర్ స్పందనపై టీడీపీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేశారు. అంతేకాదు వైసీపీకి జూనియర్ ఎన్టీఆర్ కు లింక్ పెట్టేశారు. ఆ తర్వాత టీడీపీలో జూనియర్ ప్రస్తావన రాలేదు.
ఇదిలా ఉంటే ఇటీవల చంద్రబాబు కుప్పం పర్యటనలో పలువురు కార్యకర్తలు పవన్ కల్యాణ్ తో పొత్తుపొట్టుకోవాలని కోరాగా.. వెంటనే చంద్రబాబు స్పందించారు. వన్ సైడ్ లవ్ కు స్పందన రావాల్సి ఉందని ఆయన అన్నారు. జూనియర్ విషయంలో అస్సలు స్పందించని బాబు.. పవన్ కల్యాణ్ పేరెత్తేసరికి వెంటనే రియాక్ట్ అయ్యారు. దీంతో జనసేనతో పొత్తుకు టీడీపీ తలుపులు తెరిచే ఉందని పరక్షంగా ప్రకటించారు చంద్రబాబు. దీంతో ఇక జూనియర్ ఎన్టీఆర్ అవసరం టీడీపీకి లేదని బాబు చెప్పకనే చెప్పారన్న టాక్ వినిపిస్తోంది.
పవనే బెటర్ అని డిసైడయ్యారా..?
చంద్రబాబు వైఖరి చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ ను తెచ్చుకునేకంటే పవన్ కల్యాణ్ తో స్నేహంతోనే ఎక్కువ ప్రయోజనమని చంద్రబాబు భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున ప్రచారం చేసినా పార్టీని గెలిపించలేకపోయారు. 2014 ఎన్నికల్లో పవన్ ప్రచారం టీడీపీ విజయంలో కీలకపాత్ర పోషించింది. దీంతో మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకొస్తే పదవులివ్వాలనే డిమాండ్ పార్టీలోనే పెరుగుతుంది. అదే పవన్ తో అలాంటి గొడవ ఉండదనేది చంద్రబాబు ప్లాన్ గా కనిపిస్తోంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.