Chandra babu Naidu: సీఎంగా ఉన్నప్పుడు ఆ తప్పు చేశా... కార్యకర్తల ముందు అంగీకరించిన చంద్రబాబు...

చంద్రబాబునాయుడు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Ex CM Nara Chandra babu Naidu) కుప్పం (Kuppam) పర్యటన కొనసాగుతోంది. మొదటి రోజు ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుప్పం పర్యటన కొనసాగుతోంది. మొదటి రోజు కుప్పంలో పర్యటించిన ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎంగా ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకోలేని మాట వాస్తవమేనని.. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టడం వల్ల కార్యకర్తలకు దూరమయ్యాయని.. వారికి ఎక్కువ సమయం ఇవ్వలేకపోయానని చెప్పారు. ఇకపై నిత్యం కార్యకర్తలతోనే ఉంటానన్న చంద్రబాబు.., అన్ని విషయాల్లో వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఐతే చంద్రబాబు వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో కుప్పంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అంతగా ప్రభావం చూపలేకపోవడంతో చంద్రబాబు రూటు మార్చారని రాజకీయ విశ్లేషకులంటున్నారు. మున్సిపల్, ఎంపీటీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేయాలనే ఉద్దేశంతోనే బాబు ఇళాంటి కామెంట్స్ చేసినట్లు అభిప్రాయపడుతున్నారు.

  కుప్పం నియోజకవర్గ పరిధిలోని 89 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా 75 చోట్ల వైసీపీ విజయం సాధించింది. దీంతో చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో కుప్పం ప్రజలను తనవైపు తిప్పుకునే వ్యూహంలో భాగంగానే చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు స్థానిక వైసీపీ నేతలు చంద్రబాబు రాకను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. కరోనా సమయంలోనూ కుప్పంను పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడెలా వచ్చారని ప్రశ్నించారు.

  ఇది కూడా చదవండి : అక్కడ 20 ఏళ్ల తర్వాత మున్సిపల్ ఎన్నికలు.. ఆలస్యానికి కారణమేంటో తెలుసా..?  తన పర్యటనలో భాగంగా గుడుపల్లి మండలం కొడతనపల్లి పంచాయితీలో సర్పంచ్‌గా గెలిచిన వెంకటేష్‌ను చంద్రబాబు అభినందించారు. వైసీపీ నేతల దౌర్జన్యాలకు ఎదురొడ్డి విజయం సాధించడం అభినందనీయమన్నారు. పంచాయితీ ఎన్నికలు దౌర్జన్యాలతో జరిపించారని మండిపడ్డారు. తాము బలపరిచిన అభ్యర్థులను అన్ని విధాలా భయపెట్టారని, కుప్పంలో ఏదో సాధించామని విర్రవీగుతున్నారని మండిపడ్డారు. అన్ని గుర్తుపెట్టుకుంటున్నానని, వడ్డీతో కాదు చక్రవడ్డీతో సహా తిరిగిస్తానన్నారు. కుప్పంపై కక్ష కట్టి అన్ని విధాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఎవరిని వదిలిపెట్టనని హెచ్చరించారు.

  తాను కూడా గతంలో ఇలాగే ఉండి ఉంటే ఈ పుంగనూరు నేత అసలు ఉండేవారా అని ప్రశ్నించారు? తాను కక్ష సాధింపు చర్యలు ఎప్పుడు చేయలేదన్నారు. ఏడాదిన్నరే ఈ ప్రభుత్వం.. తరువాత జమిలి ఎన్నికలు వస్తాయని.. అప్పుడు తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. భయపెడితే భయపడడానికి ఇది పుంగనూరు, కడప కాదు.. కుప్పం ఖబడ్దార్ గుర్తుపెట్టుకోండి అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తరచు కుప్పం వచ్చి సమస్యలు తెలుసుకుంటానన్నారు చంద్రబాబు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ అధికారుల పనితీరును సమీక్షిస్తానని చెప్పారు. కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులను ఒక్క సంతకంతో మాఫీ చేస్తానన్నారు. కుప్పం కార్యకర్తల కోసం ఎంతైనా ఖర్చు పెడతానని చెప్పారు.
  Published by:Purna Chandra
  First published: