ఆంధ్రప్రదేశ్ లో పెండింగ్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో తీవ్ర స్థాయి అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని, ప్రభుత్వమే హింసకు పాల్పుడుతోందని ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రధానంగా కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలో టీడీపీ అభ్యర్థులపై వైసీపీ దైర్జన్యకాండకు దిగిందని, పోలీసులు సైతం వైసీపీ పక్షాన నిలిచారన్న చంద్రబాబు.. వరుస దుర్మార్గాలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిత్తూరు, అనంతపురం సహా పలు జిల్లాల్లో స్థానిక ఎన్నికలు జరుగుతోన్న తీరుపై విస్మయం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. జగన్ సర్కారుపై, వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వంజమెత్తారు..
స్థానిక ఎన్నికల్లో వైసీపీ అక్రమాలు
అధికారపక్షం స్థానిక సంస్థల ఎన్నికలను ఏ విధంగా ప్రహసనంగా మార్చిందో ప్రజలంతా గమనించాలని, ఎక్కడికక్కడ దౌర్జన్యాలు, ప్రలోభాలు, పోలీసులు బెదిరింపులు, సెటిల్ మెంట్లు ఇష్టానుసారంగా చేస్తున్నారని, ఈ సారి అధికారపక్షానికి ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా ఒక పటిష్టమైన విధానంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. గత ఎన్నికల్లో విపక్ష అభ్యర్ధులను పోలీసులతో బెదిరించిన వైసీపీ.. ఈసారి నామినేషన్లు కూడా వేయనీయకుండా బెదిరింపులకు దిగుతోందని, రిటర్నింగ్ ఆఫీసర్ల ముందే టీడీపీ అభ్యర్థుల కాగితాలను చించేస్తున్నారని, ఎన్నికల అక్రమాలకు సంబంధంచి స్టేట్ ఎలక్షన్ కమీషన్ తో పాటు హైకోర్టుకు సైతం ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నామని తెలిపారు.
కుప్పంలో 20వేల మెజార్టీ..
కుప్పం మున్సిపాలిటీలో టీడీపీని ఓడించేందుకు వైసీపీ దుర్మార్గాలకు పాల్పడుతున్నదన్నచంద్రబాబు.. అసలు కుప్పం అంటేనే నీతి నిజాయితీ గల నియోజకర్గమని, అక్కడి ప్రజలకు గొడవలంటే తెలియని, కుప్పంలోని 14వ వార్డులో దళితుడైన వెంకటేశ్, మరో అభ్యర్థి ప్రకాష్, అతని భార్య తిరుమగల్ లపై వైసీపీ వారు దాడి చేశారని చంద్రబాబు అన్నారు. ‘గత ఎన్నికల్లో కుప్పం మున్సిపల్ పరిధిలో నన్ను 10వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారు, ఇప్పుడు 20వేలతో గెలిపిస్తారు, అది ప్రజలకు నాపై ఉన్న విశ్వాసం’అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
కుక్కల్ని కొట్టినట్లు కొడతారు..
ఎన్నికల ప్రక్రియలో అక్రమాలకు పాల్పడటం ద్వారా చట్టాలను ఉల్లంఘించిన వారిని సాక్ష్యాధారాలతో కోర్టులో నిలబెడతామని హెచ్చరించిన చంద్రబాబు.. రాష్ట్రంలో మళ్లీ రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేననే విషయాన్ని అధికారులంతా గుర్తుంచుకోవాలన్నారు. ప్రజలు తిరగబడితే వైసీపీ వాళ్లను కుక్కలమాదిరి వెంటపడి కొడతారని, జగన్ సర్కారును ప్రజాకోర్టులో దోషిగా నిలబెడతామనీ వార్నింగ్ ఇచ్చారు.
సీఎం జగన్ పై చంద్ర నిప్పులు
జగన్ సర్కారు తీరు ప్రజాస్వామ్యానికి మంచిదికాదు, రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్ తగులబెడుతున్నారని, ఏపీలో తుగ్లక్ ప్రభుత్వం నడుస్తోందని చంద్రబాబు ఫైరయ్యారు. చైతన్యవంతులైన రాష్ట్రప్రజలు ఈ అరాచకపాలనకు త్వరలోనే చరమగీతం పాడతారని చెప్పారు. ప్రెస్ మీట్ లో కుప్పం నియోజకవర్గ 14వ వార్డు అభ్యర్థి తిరుమగల్ మాట్లాడుతూ, నామినేషన్ విత్ డ్రా చేసుకున్నట్లు వార్తల్లో చూసి ఆశ్చర్యపోయానని, వైసీపీతో పోరాటానికి టీడీపీ ఎప్పుడూ వెనుకాడబోదని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm jagan, Ap local body elections, AP News, Chandrababu Naidu, Kuppam, TDP, Ysrcp