AP రాజకీయాల్లోకి TRS ఎంట్రీ -KCRను సీరియస్ గా తీసుకోవాలన్న Chandrababu -జగన్‌కు దెబ్బ? అసలేం జరుగుతోంది?

కసీఆర్, జగన్, చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ఎంట్రీ ఇవ్వబోతోందన్న కేసీఆర్ కామెంట్లపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ప్రత్యర్థుల్ని బురిడీ కొట్టించడానికో, సొంత డబ్బాను ఘనంగా కొట్టుకునే క్రమంలోనో కేసీఆర్ ఈతరహా వ్యాఖ్యలు చేయడం కొత్త కానప్పటికీ..

  • Share this:
తెలంగాణలో చేపడుతోన్న పథకాలు చూసి ఆంధ్రులు కూడా ఆహ్వానానలు పలుకుతున్నారని.. ఏపీలోనూ టీఆర్ఎస్ పెట్టాల్సిందిగా డిమాండ్లు వస్తున్నాయంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేసిన కామెంట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశమయ్యాయి. ప్రత్యర్థుల్ని బురిడీ కొట్టించడానికో, సొంత డబ్బాను ఘనంగా కొట్టుకునే క్రమంలోనో కేసీఆర్ ఈతరహా వ్యాఖ్యలు చేయడం కొత్త కానప్పటికీ.. ప్రస్తుతం అన్ని వైపురా మారిన రాజకీయ పరిస్థుల నేపథ్యంలో వాటికి ప్రాధాన్యం ఏర్పడింది. ఇది చాలదన్నట్లు, టీడీపీ అధినేత చంద్రబాబు సైతం కేసీఆర్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ సీఎం జగన్ కు బుద్ది చెప్పే ప్రయత్నం చేయడం విషయాన్ని మరింత రంజుగా మార్చింది..

రెండు రోజుల కిందట హైదరాబాద్ లో జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీలో టీసీఎం కేసీఆర్ మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్ర‌వేశ‌పెడుతున్న అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాలు.. ఇత‌ర రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షిస్తున్నాయని, ద‌ళిత బంధు ప్ర‌క‌టించిన తర్వాత ఏపీ నుంచి వేల విజ్ఞాప‌న‌లు వ‌చ్చాయని, ఏపీలోనూ టీఆర్ఎష్ పెడితే గెలిపించుకుంటామ‌ని అంటున్నారని, తెలంగాణ లాంటి ప‌థ‌కాలు త‌మ‌కు కావాల‌ని ఆంధ్రా ప్ర‌జ‌లు కోరుతున్నారని చెప్పారు. ఒకప్పుడు హైదరాబాద్ రాజ్యాంలో ఉండిన నాందేడ్, రాయ‌చూర్ జిల్లాల నుంచి డిమాండ్లు వస్తున్నాయని, వారు తెలంగాణలో కలుస్తామంటున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా, ఏపీ కంటే తెలంగాణే గొప్ప అంటూ కొన్ని లెక్కలు చదవి వినిపించారు..

ఏపీ సర్కారు కేసుల కిరికిరి పెట్టినా తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్టుల్ని పూర్తిచేశామని, విడిపోయిన తర్వాత ఏపీ త‌ల‌సరి ఆదాయం రూ. 1.70 ల‌క్ష‌లే అయితే, తెలంగాణ త‌ల‌స‌రి ఆదాయం మాత్రం రూ. 2.35 ల‌క్ష‌ల‌కు పెరిగిందని, తెలంగాణలో కరెంటు వెలుగులు విరజిమ్ముతోంటే ఏపీ చీకటిలో మగ్గుతోందని అన్నారు. కేసీఆర్ కామెంట్లకు వైసీపీ మంత్రులు ఒకరిద్దరు కౌంటర్లు వేసినా పెద్దగా ప్రచారంలోకి రాలేదు. ఇదే విషయంపై జాతీయ మీడియా ప్రతినిధులు ఢిల్లీలో చంద్రబాబును ప్రశ్నించినప్పుడు ఆయన అనూహ్యస్పందన వెలువరించారు..

టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యల టీడీపీ చీఫ్ చంద్రబాబు స్పందించారు. కేసీఆర్ వ్యాఖ్యలు ఏపీలో వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతున్నాయని అన్నారు. తెలంగాణలో వెలుగులు, ఏపీలో చీకట్లు అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యల తరువాతైనా జగన్ మేల్కొంటే బావుంటుందని చంద్రబాబు అన్నారు. జగన్ అధికారంలోకి రాగానే కరెంటు ఒప్పందాలపై రివర్స్ టెండరింగ్ అంటూ నానా యాగీ చేయడం కూడా ప్రస్తుత పరిస్థితులకు దారి తీశాయని గుర్తుచేశారు.

కేసీఆర్ కామెంట్లపై చంద్రబాబు పాజిటివ్ యాంగిల్ తీసుకోవడం, వాటితోనూ జగన్ ను దెబ్బకొట్టాలని చూడటంపై భిన్నకామెంట్లు వస్తున్నాయి. అంతర్గత పోరు ఎలా ఉన్నా, పొరుగు రాష్ట్రంవాళ్లు ఏదైనా కిరికిరి మాటలు అంటే ఒక్కటై పోరాడటం తమిళనాడు, కర్ణాటక నేతల్లో కనిపిస్తుందని, ఏపీలో మాత్రం పక్క రాష్ట్ర నేతలు తిడితే అందులో ప్రయోజనాలు, శతృవులపాలిట అస్త్రాలను వెతుక్కోవడమేంటనే అభిప్రాయాలు వ్యక్తమవుతన్నాయి. మాటల గారడీలు చేస్తారని పేరున్న కేసీఆర్ ఇలా ఆంధ్రుల గురించి చాలా సార్లు మాట్లాడినా, ఏపీ నేతలు ఏనాడూ సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పుడు కూడా చంద్రబాబు.. కేసీఆర్ వ్యాఖ్యలను జగన్ సీరియస్ గా తీసుకోవాలంటున్నారేగానీ, ఏపీని కేసీఆర్ తక్కువ చేశారనే మాటను అనడంలేదని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. కార్యకర్తల్లో జోష్ నింపడానికే కేసీఆర్ అలా ఏపీలోనూ టీఆర్ఎస్ అన్నారేతప్ప నిజంగా అలాంటి ప్రయాత్నాలేవీ సాగుతున్నట్లు పార్టీ ఎక్కడా నిర్ధారించలేదు.
Published by:Madhu Kota
First published: