సింహం ఎంటైరంది.. ఆట మొదలైంది అంటూ TDP హడావుడి -కోవింద్ వద్దకు Chandrababu -మోదీ,షా దర్శనం లేనట్లేనా?

ఢిల్లీలో చంద్రబాబు

ఏపీలో పెను దుమారం రేపిన బొషిడికే పంచాయితీ ఢిల్లీకి చేరింది. జగన్ ప్రభుత్వం ఉగ్రచర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలనే డిమాండ్ తో టీడీపీ చీఫ్ చంద్రబాబు నేడు రాష్ట్రపతిని కలవనున్నారు. చంద్రబాబు ఢిల్లీ రాక సందర్భంగా సింహం ఎంటరైందంటూ టీడీపీ శ్రేణులు హడావుడి చేశాయి..

  • Share this:
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ రచ్చకు కారణమైన ‘బోషిడికే వివాదం’ ఇప్పుడు ఢిల్లీకి చేరింది. సదరు పదం సాక్షిగా ప్రతిపక్ష టీడీపీ, అధికార వైసీపీల మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరగడం, దాన్ని ప్రభుత్వ ఉగ్రవాదంగా ఆరోపిస్తోన్న చంద్రబాబు.. జగన్ సర్కారుపై ఫిర్యాదు చేసేందుకు హస్తిన వచ్చారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్న చంద్రబాబుకు అక్కడి పార్టీ ప్రతినిధులు స్వాగతం పలికారు.

టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ నివాసానికి వెళ్లడంతో చంద్రబాబు ఢిల్లీ పర్యటన మొదలైంది. మధ్యాహ్నం 12:30 గంటలకు చంద్రబాబు బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి ఏపీలోని తాజా పరిస్థితులను బాబు బృందం వివరించనుంది. టీడీపీ కార్యాలయాలపై దాడులు, ఏపీలో డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా, శాంతి భద్రతల లోపం తదితర అంశాలనూ బాబు ప్రస్తావించనున్నారు.జగన్ ప్రభుత్వమే ఉగ్రచర్యలకు పాల్పడుతున్నందున ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలనీ చంద్రబాబు కోరనున్నారు. మొత్తం మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్న చంద్రబాబు తొలిరోజైన సోమవారం రాష్ట్రపతిని కలవనుండటం ఇప్పటికే ఖరారైంది. అయితే, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఇంకొందరు కేంద్ర మంత్రులను సైతం టీడీపీ అపాయింట్మెంట్ కోరింది. కానీ ఇప్పటిదాకా అవేవీ ఖరారు కాలేదు.

చంద్రబాబు ఢిల్లీ పర్యటన సందర్భంగా సోషల్ మీడియాలో టీడీపీ శ్రేణులు, అనుకూల వర్గాలు హడావుడి చేస్తున్నాయి. ‘సింహం ఢిల్లీలోకి ఎంటరైంది..’, ‘హస్తినలో బాబు ఆగమనం.. ఇక ఆట మొదలైనట్లే..’ లాంటి క్యాప్షన్లతో టీడీపీ శ్రేణులు చంద్రబాబు ఫొటోలను షేర్ చేస్తున్నారు.
Published by:Madhu Kota
First published: