Andhra Pradesh: దేశానికి వ్యాక్సిన్ అందించిన భారత్ బయోటెక్ కు కులం రంగు.. జగన్ సర్కార్ తీరుపై చంద్రబాబు ఫైర్

సాధన దీక్షలో సీఎం జగన్ తీరుపై చంద్రబాబు ఫైర్

ఆంధ్రప్రదేశ్ లో పేదవాడి నడ్డి విరిగిపోతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు తప్ప ప్రభుత్వం చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. ఆఖరికి భారత్ బయోటెక్ కూడా కులం రంగు అంటగట్టడం దారుణమని.. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు.

 • Share this:
  భారత దేశం కోసం కరోనాకు వ్యాక్సిన్ రూపొందించిన భారత్ బయోటెక్‌కు కులం రంగు పూయటం నాగరికతా? అలాంటి వ్యాఖ్యలు చేసిన ఈ ముఖ్యమంత్రికి బుద్ది ఉందా? అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. మంగళవారం సాధన దీక్ష చేపట్టిన ఆయన మాట్లాడుతూ సంక్షోభాలకు తానెప్పుడూ భయపడనన్నారు. సమాజాన్ని కాపాడాలనే ఏకైక ధ్యేయం తనదని స్పష్టం చేశారు. ఆదాయాలు కోల్పోతున్న ప్రజానీకానికి కొనుగోలు శక్తి పెంచకుండా ఇంకా లాగేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, కార్మికులు, టీచర్లు ఇలా అనేక రంగాల వారు పనిలేకుండా అవస్థలు పడుతున్నారని అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా కర్ఫ్యూ నేపథ్యంలో అటో డ్రైవర్లు, రిక్షా పుల్లర్లు, హమాలీలు పనిలేకుండా ఇబ్బందులు పడుతుంటే వాళ్లను పరిమర్శించే వారు లేరా అని ప్రశ్నించారు.

  తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను చూసి ఏపీ సీఎం జగన్ చాలా పాటాలు నేర్చుకోవాలన్నారు. తమిళనాడులో అమ్మ క్యాంటిన్లు పెట్టారని.. ఇది మంచి ఉద్దేశంతో పెట్టారని, దీన్ని తీసేయడం సరికాదని సీఎం స్టాలిన్ అన్నారని కొనియాడారు. అమ్మ క్యాంటిన్‌లో జయలలిత ఫోటో పెట్టి కొనసాగిస్తున్నారని అది రాజకీయ సంస్కృతికి నిదర్శనమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీలో మాత్రం 5 రూపాయలకే పేదలకు అన్నంపెట్టే అన్న క్యాంటీన్లు రద్దు చేసి పేదల కడుపుపై కొట్టారని దుయ్యబట్టారు. న్యాయమైన డిమాండ్లు కోరిన విద్యార్థులపై అత్యాచారం కేసులు పెట్టారని, అసలు అత్యాచార నిందితుల్ని పట్టుకోలేక ప్రశ్నించేవారిపై అత్యాచారం కేసులు పెడుతున్నారని విమర్శించారు. చేతనైతే పేదల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలన్నారు. తప్పుడు కేసులు పెడతామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. టీడీపీ హయాంలో తాను ఇలానే తప్పుడు కేసులు పెట్టి ఉంటే వైసీపీలో ఒక్కరు కూడా రోడ్డుపైకి వచ్చే వారు కాదని చంద్రబాబు పేర్కొన్నారు.

  తాడేపల్లి గ్యాంగ్ రేప్ ఘటనపై చంద్రబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. ఉన్న చట్టాలను అమలు చేసే సత్తా సీఎం జగన్‌కు ఉంటే ఆ చట్టాలే సరిపోతాయని అన్నారు. లేని దిశ చట్టానికి యాప్, వాహనాలు, పోలీస్ స్టేషన్‌ల వల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. సీఎం ఇంటి పక్కన అత్యాచారం జరిగితే పట్టించుకోకుండా సాధన దీక్ష దృష్టి మళ్లించేందుకే దిశ కార్యక్రమం పెట్టారని ఎద్దేవా చేశారు. కరోనాకు ప్రపంచ దేశాలన్నీ భయపడితే జగన్ రెడ్డి తేలిగ్గా తీసుకున్నారని చంద్రబాబు విమర్శించారు. బాధ్యత గల ప్రతిపక్షంగా ముందు జాగ్రత్తలపై ప్రభుత్వాన్ని హెచ్చరించినా ఏమాత్రం పట్టించుకోకపోగా ఎగతాళి చేశారని మండిపడ్డారు. 5 కోట్ల మంది ఆరోగ్యం గురించి ఆలోచించమంటే తప్పుడు కేసులు పెట్టారని దుయ్యబట్టారు. టెన్త్, ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థుల పట్ల కూడా వితండవాదం చేశారని, 16.53 లక్షల మంది విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుకుందామని చూశారని, తప్పుడు సమాచారంతో సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టించాలనుకున్నారని విమర్శించారు. న్యాయస్థానం గట్టిగా హెచ్చరించడంతో సీఎం జగన్ తోక జాడించారని చంద్రబాబు అన్నారు.
  Published by:Nagesh Paina
  First published: