TDP CHIEF CHANDRA BABU NAIDU SLAMS TIRUMALA MAIN PRIEST RAMANA DEEKSHITHULU COMMENTS ON AP CM JAGAN MOHAN REDDY TPT NGS
Andhra pradesh: జగన్ దేవుడా? విష్ణు మూర్తితో పోల్చడంపై చంద్రబాబు ఏమన్నారో తెలుసా?
శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు
ఏపీ సీఎం జగన్ ను దేవుడితో పోల్చడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేవుడు దేవుడే మనిషి మనిషే అంటూ.. రమణ దీక్షితుల వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారాన్ని ప్రారంభించే ముందు ఆనవాయితీగా చంద్రబాబు శ్రీవారి దర్శనం చేసుకున్నారు.
తిరుపతి ఉప ఎన్నిక ప్రచార బరిలోకి దిగారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అంతకుముందు టీడీపీలో అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ఆయన ఈ ఉప ఎన్నిక ముందు స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తరుపున ప్రచారానికి వెళ్లే ముందు.. రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత, తిరుపతి లోకసభ అభ్యర్థి పనబాక లక్ష్మీతో కలిసి నేరుగా తిరుమలకు చేరుకున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని చంద్రబాబు దర్శించుకున్నారు. స్వామి వారి ప్రత్యేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న తరువాత రంగనాయకుల మండపంలోని వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా.. ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించారు. శ్రీవారి దర్శనం తరువాత ఆలయం బయట మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ ను దేవుడితో పోల్చడంపై మండిపడ్డారు. ఇటీవల ప్రధాన అర్చకులుగా నియమితులైన రమణ దీక్షితులు.. సీఎం జగన్ ను విష్ణుమూర్తి పోల్చారు. రమణ దీక్షితులు చేసిన ఈ వ్యాఖ్యల పై పరోక్షంగా మండిపడ్డారు చంద్రబాబు. దేవుడు దేవుడే.. మనిషి మనిషే.. మనిషి ఎప్పుడు దేవుడు కాలేడని.. మనుషులను దేవుడితో పోల్చడం.. దేవుని కంటే గొప్పగా చెప్పడం చాలా తప్పని చంద్రబాబు మండిపడ్డారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక తిరుమలలో చాలా అపవిత్ర కార్యక్రమాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. పింక్ డైమండ్ మాయం లాంటి ఆరోపణలు చేసిన వ్యక్తిని మళ్ళీ నియమించడం మంచి సంప్రదాయం కాదన్నారు చంద్రబాబు. ఇలాంటి వ్యక్తులను నియమించడం ద్వారా కోట్లాది మంది హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతీయడమే అంటూ మండిపడ్డారు. శ్రీనివాసుడి పాద పద్మముల దగ్గర జన్మించడం తన పూర్వ జన్మ సుకృతమన్నారు. అందుకే .శ్రీవారి ఆశీస్సులతో మావోల దాడి నుంచి బయట పడ్డానని అన్నారు చంద్రబాబు. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుందన్నారు. రాష్ట్రానికి అంతా మంచి జరగాలని శ్రీవారిని ప్రార్ధించానని అన్నారు. ఏపీకి ఉన్న అతి పెద్ద ఆస్తి వెంకటేశ్వర స్వామి అన్నారు. అందుకే తిరుమల పవిత్రతను కాపాడుకోవడం అందరి బాధ్యత అని గుర్తు చేశారు.
తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు నేటి నుంచి 8 రోజుల పాటు తిరుపతిలోనే మకాం వేయనున్నారు. మొదట సత్యవేడు నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. తిరుపతి లోక్ సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఆయన బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఇప్పటికే టీడీపీ కీలక నేతలంతా తిరుపతిలోనే మోహరించారు. పనబాక లక్ష్మి తరపున ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వ్యక్తిగతంగా పనబాక కూడా వింత వింత ప్రచారాలతో దూకుడు చూపిస్తున్నారు. తాజాగా చంద్రబాబు నాయుడు ప్రచారం మొదలెట్టారు. త్వరలోనే బాలయ్య కూడా తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి రానున్నారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.