Home /News /politics /

మంగళగిరిలో లోకేష్‌కి భారీ మెజార్టీ... టీడీపీ రిపోర్టులో ఏం తేలిందంటే...

మంగళగిరిలో లోకేష్‌కి భారీ మెజార్టీ... టీడీపీ రిపోర్టులో ఏం తేలిందంటే...

ఎన్నికల ప్రచారంలో లోకేష్ (Image : Lokesh Nara/Twitter)

ఎన్నికల ప్రచారంలో లోకేష్ (Image : Lokesh Nara/Twitter)

AP Assembly Election 2019 : మంగళగిరిలో చంద్రబాబు అనుకున్నదానికంటే ఎక్కువ మెజార్టీతో లోకేష్ గెలుస్తాడని రిపోర్ట్ రావడంతో టీడీపీ వర్గాలు సంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది.

ఏపీలోని కీలక నియోజక వర్గాల్లో గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఒకటి. ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు కొడుకు లోకేష్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగడంతో ఆయన విజయావకాశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. లోకేష్ ప్రస్తుతం నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చెయ్యనివ్వకుండా... ఎన్నికల్లో బరిలో దింపారు చంద్రబాబు. ఇందుకు ప్రధాన కారణం లోకేష్ ఓడిపోతే, తిరిగి ఎమ్మెల్సీగా కొనసాగించాలనే ఉద్దేశంతోనే అంటున్నాయి ప్రతిపక్షాలు. లోకేష్ గెలుస్తారనీ, కాకపోతే కొద్దిపాటి మెజార్టీతో గెలుస్తారని ఏప్రిల్ 11న ఎన్నికలు ముగిసిన తర్వాత ఏప్రిల్ 13న చంద్రబాబుకి సన్నిహిత వర్గాలు చెప్పినట్లు తెలిసింది. అప్పటి నుంచీ చంద్రబాబు... లోకేష్ గెలుపుపై ధీమాగా ఉన్నారు. తాజాగా నియోజకవర్గాల వారీగా ఆయా అభ్యర్థుల నుంచీ రిపోర్టులు తెప్పించుకుంటున్న చంద్రబాబు... మంగళగిరిలో పరిస్థితి ఏంటన్నదానిపై లోకేష్ నుంచీ రిపోర్ట్ తెప్పించుకొని పరిశీలించారు. అందులో లోకేష్‌కి ప్రధాన ప్రత్యర్థి కంటే 30 శాతం ఎక్కువ ఓట్లు వస్తాయని ఉన్నట్లు తెలిసింది. దాంతో చంద్రబాబుతోపాటూ టీడీపీ వర్గాలు ఫుల్ ఖుషీ అయిపోయాయి.

రిపోర్ట్ ఎలా తయారైంది ? : సాధారణంగా ఏ అభ్యర్థైనా చంద్రబాబుకు రిపోర్ట్ ఇచ్చేటప్పుడు కచ్చితంగా గెలుస్తామనే ఇస్తారు తప్ప ఓడిపోతారని ఇవ్వరు. అలాంటప్పుడు ఆయా అభ్యర్థుల నుంచీ రిపోర్టులు తెప్పించుకోవడం వల్ల ఉపయోగం ఏముంటుందన్నది వైసీపీ వేస్తున్న ప్రశ్న. మే 23 వచ్చే వరకూ ఇలాంటి కహానీలతో ప్రజలను మభ్యపెట్టే పనిలో ఉన్నారని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు. టీడీపీ వర్గాలు మాత్రం వైసీపీ ఆరోపణలను ఖండిస్తున్నాయి. చంద్రబాబుకి ఇచ్చే రిపోర్టులు అత్యంత కచ్చితమైనవి అనీ, క్షేత్రస్థాయిలో పోలింగ్ బూత్‌లు, ఓటర్లు, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల బలాబలాలు, స్థానిక సమీకరణాలు, ప్రచారంలో హోరు, పోలింగ్ జరిగిన తీరు, ఓటర్లు స్పందించిన విధానం, జరిగిన అభివృద్ధి, ప్రభుత్వం కలిగించిన ప్రయోజనాలు ఇలా దాదాపు 50 రకాల అంశాల్ని లెక్కలోకి తీసుకొని... రిపోర్టులు తయారు చేశామంటున్నారు. అందువల్ల వంద శాతం కచ్చితత్వంతో రిపోర్టులు ఉంటున్నాయన్నది వారి వాదన.

లోకేష్ గెలుపు సాధ్యమేనా? : టీడీపీ వర్గాలు ఇంత పాజిటివ్‌గా ఉన్నా, మంగళగిరిలో లోకేష్ గెలుపు అంత తేలిక కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మంగళగిరిలో 2014లో వైసీపీ తరపున గెలిచిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి మరోసారి బరిలో దిగి లోకేష్‌కు గట్టిపోటీ ఇచ్చారు. స్థానికంగా ఆయనకు మంచి పేరుంది. ప్రజలకు ఏ అవసరం వచ్చినా వెంటనే స్పందిస్తారనే సానుకూల అంశాలున్నాయి. ఐతే అదే మంగళగిరిలో టీడీపీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా ఐటీ సంస్థలకు అక్కడ ప్రత్యేక వెసులుబాట్లు కల్పించింది. అదీ కాక మంగళగిరి... రాజధాని అమరావతిలో భాగంగా ఉంటోంది. దాంతోపాటూ... సీఎం చంద్రబాబు కొడుకైనందున టీడీపీ అధికారంలోకి వస్తే, లోకేష్ వల్ల మంగళగిరి ఎక్కువ అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో తటస్థ ఓటర్లు టీడీపీకి ఓటు వేస్తారని భావించి... ఆ స్థానంలో లోకేష్‌ని దింపారని తెలుస్తోంది. పైగా లోకేష్ అసమర్థుడనీ, దమ్ముంటే ఎమ్మెల్యేగా గెలిచి, అప్పుడు మంత్రి పదవి చేపట్టాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా సవాల్ విసిరారు. ఆ సవాల్‌ని స్వీకరించిన లోకేష్... దేనికైనా తెగించాలనే ఉద్దేశంతోనే మంగళగిరిని ఎంపిక చేసుకున్నారని తెలిసింది. మంగళగిరిలో ప్రచారం విషయంలో టీడీపీ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అందువల్ల గెలుపుపై ఆ పార్టీ ధీమాగా ఉండటంలో ఆశ్చర్యం అక్కర్లేదు.

లోకేష్ గెలిస్తే ఏమవుతుంది : లోకేష్ గెలిచే అవకాశాలు తక్కువేనని బెట్టింగ్ బుకీలు చెబుతున్నారు. అయినప్పటికీ ఆయన గెలిస్తే ఏమవుతుందన్న అంశంపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. లోకేష్ ఓడిపోతే, తిరిగి ఎమ్మెల్సీగా కొనసాగుతారు. ఇది క్లియర్. ఒకవేళ లోకేష్ గెలిచి, టీడీపీ ఓడిపోతే... ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు తర్వాత లోకేష్ ప్రతిపక్షంలో ప్రధాన నేతగా కొనసాగుతారు. అలాకాకుండా లోకేష్ గెలిచి, టీడీపీ అధికారంలోకి వస్తే, చంద్రబాబు వారసుడిగా భవిష్యత్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా లోకేష్ అవతరించే అవకాశాలుంటాయి. అలాంటి పరిస్థితే వస్తే, మంగళగిరి అభివృద్ధిపై లోకేష్ ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశాలుంటాయి. ఇలాంటి రకరకాల లెక్కలు వేస్తున్న విశ్లేషకులు మరో 9 రోజుల్లో మే 23న ఫలితాల రోజున అసలు లెక్కలు తెలుస్తాయంటున్నారు.

 

ఇవి కూడా చదవండి :

మా తమ్ముడు బంగారం... పవన్ కళ్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర కామెంట్స్...

ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్... ఒక్కో ఎమ్మెల్యే రేటు రూ.30 కోట్లు..?

జగన్ కి శ్రీ రెడ్డి సపోర్ట్... వైసీపీ లోకి ఎంట్రీ..? మరో రోజా అవుతారా..?
First published:

Tags: Andhra Pradesh Assembly Election 2019, Chandrababu naidu, Jabardasth comedy show, Mangalagiri, MLA Roja, Nara Lokesh, Tdp, Ycp, Ysrcp

తదుపరి వార్తలు