ఏపీలో నేతలందరి దారి వైసీపీ వైపే... ఈసారి భిన్నంగా.. ?

వైసీపీలో చేరికలు ఎంతవరకు కొనసాగుతాయి... అవి ఇతర పార్టీలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్నది రాజకీయవర్గాలకు అర్థంకావడం లేదు.

news18-telugu
Updated: March 12, 2020, 7:54 PM IST
ఏపీలో నేతలందరి దారి వైసీపీ వైపే... ఈసారి భిన్నంగా.. ?
సీఎం జగన్‌తో కరణం వెంకటేశ్, కరణం బలరాం
  • Share this:
ఏపీలో అనూహ్యంగా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. వివిధ పార్టీలకు చెందిన నాయకులు వరుసగా వైసీపీ కండువా కప్పుకుంటున్నారు. అందులోనూ ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి చెందిన నాయకులు క్యూలో కనిపిస్తున్నారు. టీడీపీ తరపున ఎమ్మెల్సీ గా ఉన్న డొక్కా మాణిక్యవరప్రసాద్ వైసీపీ వైపు వెళుతున్నాడన్న విషయం గత మండలి సమావేశాల్లోనే తేలిపోయింది. ఆయన చేరిక పూర్తయింది. తర్వాత మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు పార్టీలో చేరిపోయారు. వీరందరికీ ముందే శాసనసభ్యులు వల్లభనేని వంశీమోహన్, మద్ధాళి గిరి లో టీడీపీని వీడారు. పార్టీ కండువా కప్పుకోకున్నా వైసీపీ అనుబంధ సభ్యులుగా కొనసాగుతున్నారు. మద్దాళి గిరికి ఏకంగా గుంటూరు మార్కెట్ యార్డు గౌరవ ఛైర్మన్‌గా పదవిని అందుకున్నారు.

తాజాగా కరణం బలరాం కూడా వైసీపీకి అనుకూలంగా మారిపోవడం టీడీపీ శ్రేణులకు షాక్ ఇస్తోంది. గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌పై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. బలరాంకు చీరాల సొంత నియోజకవర్గం కాదు.. ఆయన అద్దంకి నుంచి పోటీ చేసేవారు. కానీ గతంలో టీడీపీలో ఉన్న ఆమంచి వైసీపీలోకి వెళ్లడంతో.. కరణంను చంద్రబాబు చీరాల పంపించారు. ఎన్నికలకు ముందు నియోజకవర్గ బాధ్యతలు స్వీకరించిన ఆయన కృష్ణమోహన్‌పై 17వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.

గతంలో కాంగ్రెస్‌లో ఉన్న బలరాం.. ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరారు. అంతేకాదు అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే కొంతమంది నేతల్లో ఈయన కూడా ఒకరనే పేరుంది. 4 సార్లు ఎమ్యెల్యేగా, ఒక సారి ఎంపీగా గెలిచారు. మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీగా కూడా పనిచేసిన కరణం బలరాం పార్టీ కండువా కప్పుకోకున్నా వైసీపీ అనుబంధ సభ్యులుగా కొనసాగేందుకు సిద్ధమయ్యారు.

కడప జిల్లాలో టీడీపీ వాయిస్‌గా ఉండే రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ప్రత్యర్ధులుగా ఉన్న రామసుబ్బారెడ్డి, ఆది నారాయణరెడ్డి లు అనుకోకుండా టీడీపీలో కలిసి సాగాల్సి వచ్చింది. దానిపై తొలినుంచి విముఖత ప్రదర్శించిన రామసుబ్బారెడ్డి అప్పట్లో చంద్రబాబు సర్ధిచెప్పడంతో కొంత మౌనం వహించారు. గత ఎన్నికల ఓటమి తర్వాత నిస్తేజంగా ఉన్న ఈ మాజీ మంత్రి చివరకు అధికార పార్టీలో చేరిపోయారు. ఇంతకన్నా ప్రధాన విషయం వైఎస్ కుటుంబానికి ఎదురొడ్డి పులివెందులలో పోటీచేయడానికి కొన్ని తరాలుగా టీడీపీకి ఏకైక దిక్కుగా ఉన్న సతీశ్ రెడ్డి వైసీపీలో చేరనున్నారు. అంటే దాదాపుగా కడప జిల్లా వంటి చోట్ల ఇతరా పార్టీల ఉనికి ప్రమాదంలో పడేంతగా వలసలు సాగుతున్నాయి.

పాత నీరు పోయి కొత్తనీరు వస్తుందన్నది నానుడి.. ఆ విధంగా అయినా ఇతరా పార్టీలకు అక్కడ కొత్తనాయకత్వం ఇప్పట్లో ఏర్పడే అవకాశం కనిపించడంలేదు. ఎన్నికల సమయంలో జనసేన పార్టీలో చేరి, ఓటమి తర్వాత పసుపులేటి బాలరాజు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే పార్టీ మారడానికి ముందే ఎలాంటి పదవులు ఇస్తారనే బేరాలు ఆడే స్థితి లేదు. ఏది దక్కితే అదే మహప్రసాదం అనుకునే స్థితిలో ఉన్నారు. మొత్తానికి వైసీపీలో చేరికలు ఎంతవరకు కొనసాగుతాయి... అవి ఇతర పార్టీలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్నది రాజకీయవర్గాలకు అర్థంకావడం లేదు.

(రఘు అన్నా, న్యూస్18 కరెస్పాండెంట్, అమరావతి)
First published: March 12, 2020, 7:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading