Andhra Pradesh: టీడీపీ, చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ ఇచ్చిన ‘తిరుపతి’.. వైసీపీ కంటే ఎక్కువగా..

ప్రతీకాత్మక చిత్రం

Tirupati: టీడీపీ సైతం తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ తమతో పోటీ పడితే అది తమకు భవిష్యత్తులో మరింత ఇబ్బందిగా మారుతుందని అంచనా వేసింది.

  • Share this:
    ఏపీ రాజకీయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీడీపీ తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ఊరట కలిగించిందా ? ఈ ఎన్నికల్లో ఓడిపోయినప్పటీకీ.. టీడీపీ పెద్దగా బాధపడటం లేదా ? ఈ ప్రశ్నకు రాజకీయవర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో తాము గెలుస్తామని టీడీపీ మొదటి నుంచి పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. ఈ ఉప ఎన్నిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఇబ్బందేమీ ఉండదని టీడీపీ నేతలే చెబుతూ వచ్చారు. అయితే ఈ ఉప ఎన్నిక ఫలితాలు మాత్రం టీడీపీ ఊహించని ఫలితాలే ఇచ్చాయనే వాదన వినిపిస్తోంది. ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ బలహీనపడుతోందని.. ఆ స్థానాన్ని తాము భర్తీ చేస్తామని బీజేపీ ఎప్పటి నుంచో చెబుతోంది. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో టీడీపీతో పోటాపోటీగా ఓట్లు సాధించాలని భావించింది.

    జనసేనతో పొత్తు ఈ విషయంలో తమకు కలిసొస్తుందని భావించింది. టీడీపీ సైతం ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ తమతో పోటీ పడితే అది తమకు భవిష్యత్తులో మరింత ఇబ్బందిగా మారుతుందని అంచనా వేసింది. అందుకే తమ ఓటు బ్యాంకు చేజారిపోకుండా ఉండేందుకు గట్టిగానే ప్రయత్నించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించిన టీడీపీ.. ఈ ఉప ఎన్నికలను మాత్రం సీరియస్‌గా తీసుకుంది. స్వయంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు కొద్దిరోజుల పాటు తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. దీంతో ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన పనబాక లక్ష్మీకి 3,54,516 ఓట్లు వచ్చాయి.

    వైసీపీతో పోల్చితే 2.71 లక్షల ఓట్లు తక్కువగా వచ్చినా.. మూడో స్థానంలో బీజేపీతో పోలిస్తే టీడీపీకి దాదాపుగా మూడు లక్షల ఓట్లు ఎక్కువగా వచ్చాయి. దీంతో బీజేపీ, జనసేన కలిసినా.. తమతో పోటీ పడలేవని టీడీపీ ఓ క్లారిటీకి వచ్చింది. ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయం తామే అనే విషయం మరోసారి తేలిపోయిందని.. రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందని ఆ పార్టీ నేతలు చెబుతున్న విషయంలో వాస్తవం లేదని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: