తమిళనాడులో మళ్లీ సూర్యుడు ఉదయించాడు. డీఎంకే ఎన్నికల గుర్తులో ఉండే ఉదయించే సూర్యుడిలా.. కరుణానిధి తనయుడు తమినాడుకు సీఎం కాబోతున్నాడు. ఆదివారం వెల్లడయిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే) అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కరుణానిధి, జయలలిత మరణించిన తర్వాత తొలిసారి జరిగిన తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే పార్టీ సత్తా చాటింది. 234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే కూటమి 160 సీట్లు సాధించింది. మరో 74 సీట్లలో అన్నాడీఎంకే కూటమి గెలిచింది. డీఎంకే కూటమిలో.. డీఎంకే 126, కాంగ్రెస్ 18, ఇతర పార్టీలు మిగతా చోట్ల విజయం సాధించాయి. అన్నాడీఎంకే పార్టీలో.. అన్నాడీఎంకేలో 64, పీఎంకే 5, బీజేపీ 4 స్థానాల్లో గెలిచింది.
ఎంకే స్టాలిన్ కోళాతూర్ నియోజకవర్గం నుంచిపోటీ చేసిన విజయం సాధించారు. ఈయన కుమారుడు, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ చెపాక్ నుంచి గెలిచారు. తొలిసారి ఎన్నికల బరిలో దిగిన మక్కల్ నీది మయ్యం (MNM) పార్టీ పత్తా లేకుండాపోయింది. ఒక్క సీటు కూడా గెలవలేదు. చివరకు కమల్ హాసన్ కూడా ఓడిపోయారు. కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాస్ చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. ఇక అన్నాడీఎంకే గ్రాఫ్ పడిపోయింది. పన్నీర్ సెల్వ, పళని ప్రచారంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఆ పార్టీలో నాయకత్వలేమి స్పష్టంగా కనిపించింది. తమిళనాడులో డీఎంకే విజయం క్రెడిట్ మొత్తం ఆ పార్టీ అధినేత స్టాలిన్‌కే దక్కుతుంది. అన్నీ తానై నడిపించి పార్టీని గెలిపించారు. కూటమి పక్షాలను సమన్వయం చేసుకుంటూ.. అందరికీ ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్లారు.
తండ్రి కరుణానిధి మరణంలో 2018లో ఆయన పార్టీ బాధ్యతలు చేపట్టారు స్టాలిన్. అప్పటి నుంచే పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీపై తనదైన ముద్రవేశారు. ఎన్నికల ప్రచారంలోనూ దూకుడుగా వ్యవహరించారు. హిందీ బాషతో పాటు నీట్, జయలలిత మరణంపై మాటల తూటాలు పేల్చి.. రాజకీయాలను హీటెక్కించారు స్టాలిన్. పళని, పన్నీర్ గెలిస్తే రాష్ట్రం బాగుపడదని.. ఇన్నేళ్లలో వారు ఏం చేశారో ఆలోచించుకోవాలని ప్రజలకు అర్ధమయ్యేలా వివరించారు. మరోవైపు అన్నాడీఎంకేలో చీలికలు కూడా డీఎంకేకు కలిసొచ్చాయి. శశికళ సమీప బంధువు టీటీవీ దినకరన్ ఏఎంఎంకే పార్టీ పెట్టడంతో.. కొందరు అన్నాడీఎంకే అభిమానులు అటు మొగ్గు చూపారు. మొత్తంగా పదేళ్ల తర్వాత డీఎంకే గెలవడంతో ఆ పార్టీ పండగ చేసుకుంటోంది. ముఖ్యంగా స్టాలిన్ సీఎంగా బాధ్యతలు చేపట్టనుండడంతో కేడర్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: DMK, MK Stalin, Tamil nadu, Tamil Nadu Assembly Elections 2021