లోక్‌సభ ఎన్నికల బరిలో కార్తి చిదంబరం...ఎక్కడో తెలుసా?

కార్తి చిదంబరం(Photo:PTI)

Tamilnadu Loksabha Election 2019 | తమిళనాడులోని శివగంగ నియోజకవర్గంలో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం పలుసార్లు గెలిచారు. ఇప్పుడు ఆ టిక్కెట్‌ను చిదంబరం తనయుడు కార్తి చిదంబరంకు కాంగ్రెస్ పార్టీ కేటాయించింది.

  • Share this:
    కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి పీ.చిదంబరం తనయుడు కార్తి చిదంబరం లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవనున్నారు. తమిళనాడులోని శివగంగ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కార్తి చిదంబరంను కాంగ్రెస్ పార్టీలో బరిలో దింపనుంది. ఆ మేరకు ఆయనకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఖరారు చేసింది. కాంగ్రెస్ పార్టీ 10 మంది లోక్‌సభ అభ్యర్థులతో విడుదల చేసిన ఐదో జాబితాలో కార్తి చిదంబరంకు చోటు కల్పించింది. తమిళనాడులో డీఎంకే‌ కూటమిలో పొత్తులో భాగంగా పుదుచ్చేరి సహా 10 లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీకి కేటాయించారు.

    గతంలో పలుసార్లు చిదంబరం ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యంవహించారు. కాంగ్రెస్ టిక్కెట్‌పై ఆరుసార్లు, కాంగ్రెస్ చీలిక వర్గం టీఎంసీ నుంచి రెండుసార్లు ఇక్కడి నుంచి ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో చిదంబరం ఇక్కడ ఓటమి చెవిచూశారు. ఆ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థిగా చిదంబరం బరిలో నిలవగా...కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ నాచియప్పన్ అక్కడ విజయం సాధించారు. చిదంబరం, కార్తి చిదంబరంపై అవినీతి, మనీలాండరింగ్ కేసులు ఉండడంతో వారికి టిక్కెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ విముఖత చూపినట్లు తెలుస్తోంది. వారిద్దరికి బదలు మరో అభ్యర్థి కోసం అన్వేషించినట్లు తెలుస్తోంది. అయితే చిదంబరం పట్టుబట్టి తన తనయుడు కార్తి చిదంబరంకు టిక్కెట్ ఇప్పించుకున్నట్లు సమాచారం. శివగంగ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి హెచ్.రాజాతో కార్తి చిదంబరం తలపడనున్నారు. అన్నాడీఎంకే కూటమిలో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు.

    కాగా ఉత్కంఠ రేపిన కర్ణాటకలోని బెంగళూరు దక్షిణ నియోజకవర్గానికి తమ పార్టీ అభ్యర్థిగా బీకే హరిప్రసాద్ పేరును కాంగ్రెస్ ఖరారు చేసింది. ఇక్కడి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేయవచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో హరిప్రసాద్ పేరును కాంగ్రెస్ పార్టీ ఖరారు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
    First published: