Home /News /politics /

TAMILNADU CM STALIN WROTE A LETTER TO AP CM JAGAN ON OPPOSE THE CENTRAL GOVERNMENT NEW BILL AGAINST PORT NGS

Stalin letter to Jagan: మోదీకి వ్యతిరేకంగా జగన్ వెళ్తారా? స్టాలిన్ లేఖపై సీఎం స్పందిస్తారా

ఏపీ సీఎం జగన్ కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ

ఏపీ సీఎం జగన్ కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ

ఏపీ సీఎం జగన్ దారెటు..? బీజేపీతో కలిసి ముందుకు వెళ్తారా..? లేక వ్యతిరేక కూటమితో ప్రయాణిస్తారా.. ఈ ప్రశ్నలకు సమాధానం రావాలంటే.. తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్ రాసిన లేఖపై సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నదానిపై ఆధారపడి ఉంటుంది.

ఇంకా చదవండి ...
  దేశ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.. ఇప్పటికే థర్డ్, ఫోర్త్ ఫ్రంట్ అంటూ ప్రచారం సాగుతోంది. మరోవైపు శరద్ పవర్ అధ్యక్షతన ఎన్డీయేతర పార్టీలు అన్నీ ఏకమవుతున్నాయి. కాంగ్రెస్ ను కాదని బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలన్నింటీకీ ఏక తాటిపైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కూటమి గురించి వచ్చే వార్తలను నేతల ఖండిస్తున్నా.. వారి మాటలకు అర్థాలే వేరు అనేలా పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా శరద్ పవార్ తో పలువురి నేతల సమావేశం.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ -శరద్ పవార్ భేటీ సంకేతాలు ఇస్తునే ఉన్నాయి. అయితే మోదీకి వ్యతిరేకంగా ఏర్పడే కూటమిలో కచ్చితంగా తమిళనాడు సీఎం స్టాలిన్ ఉంటారు. కూటమిలో ఆయన ప్రధాన పాత్ర పోషించే అవకాశాలను కొట్టి పారేయలేం.. ఇదే సమయంలో స్టాలిన్ ఏపీ సీఎం జగన్ కు లేఖ రాయడం.. అది కూడా మోదీకి వ్యతిరేక అంశంపై లేఖ రాయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

  కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఇండియన్‌ పోర్ట్స్‌ బిల్లు–2021 ముసాయిదాను తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. మైనర్‌ పోర్టుల విషయంలో రాష్ట్రాల ప్రాధాన్యతను తగ్గించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేయాలని కోరుతూ 8 తీరప్రాంత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ తాజాగా లేఖ రాశారు. చిన్నతరహా ఓడరేవులపై పెత్తనాన్ని మారిటైమ్‌ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌కు కట్టబెట్టేలా కేంద్ర పోర్ట్స్, షిప్పింగ్, వాటర్‌వేస్‌ మంత్రిత్వ శాఖ ఈ ముసాయిదా బిల్లును తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై రాష్ట్రాలతో చర్చించేందుకు ఎంఎస్‌డీసీ ఈ నెల 24న సమావేశాన్ని తలపెట్టిందని ఆ లేఖలో పేర్కొన్నారు.

  ప్రస్తుతం అమల్లో ఉన్న ఇండియన్‌ పోర్ట్స్‌ యాక్ట్‌–1908 ప్రకారం.. మైనర్‌పోర్టుల ప్రణాళిక, అభివృద్ధి, క్రమబద్ధీకరణ, నియంత్రణ వంటివి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉన్నాయి. ఇకపై ఇలాంటి అధికారాలను ఎంఎస్‌డీసీకి బదిలీ చేయాలని కొత్త బిల్లులో ప్రతిపాదించడం సరైన నిర్ణయం కాదని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను కేంద్ర ప్రభుత్వం లాక్కుంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందకే రాష్ట్రాలకు నష్టం చేకూర్చేలా ఉన్న ఈ బిల్లుపై అభ్యంతరాలను కేంద్రానికి తెలియజేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌తో సహా గుజరాత్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రులకు లేఖ రాశారు.

  ఈ బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందితే చిన్నతరహా ఓడరేవుల విషయంలో ఇక రాష్ట్రాలకు ప్రాధాన్యమైన పాత్ర ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాల అధికారాలను హరించే బిల్లును కలిసికట్టుగా అడ్డుకుందామని తీరప్రాంత రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్‌ పిలుపునిచ్చారు. ఈ నెల 24న జరిగే ఎంఎస్‌డీసీ సమావేశంలో మన గళం వినిపిద్దామన్నారు. అయితే ఇందులో సీఎం జగన్ కు లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది. ఇతర సీఎంల సంగతి ఎలా ఉన్నా.. జగన్ ఎన్డీఏ లో లేనప్పటికే ప్రధాని మోదీ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ఆయన సమర్ధిస్తూ వస్తున్నారు. తాజాగా వ్యాక్సినేషన్ విషయంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శలు చేస్తే.. సీఎం జగన్ మోదీకి మద్దతుగా నిలిచారు. అంతేకాదు కరోనా కష్ట సమయంలో సీఎంలు అంతా ప్రధానికి మద్దతుగా నిలవాలంటూ లేఖలు కూడా రాశారు. ఇలా మోదీకి అన్ని విషయాల్లోనూ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు జగన్. మరి ఇప్పుడు ఓడరేవుల అంశంలో స్టాలిన్ కోరిక పై ప్రధానిని వ్యతిరేకిస్తారా అన్నారన్నది వేచి చూడాలి. ఈ బిల్లును సీఎం జగన్ వ్యతిరేకిస్తే.. తాను ఎన్డీఏకు వ్యతిరేకంగా ఏర్పడే కూటమిలో చేరుతున్నాను అనే సంకేతాలు అందుతాయి.. లేదా ఎప్పటిలాగే జై మోదీ అంటే.. విపక్షాల కూటమికి సీఎం జగన్ దూరమైనట్టే..
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, MK Stalin, Tamil

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు