యూపీలో మహాకూటమి ప్రస్థానం మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయే అవకాశముంది. లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మహాగఠ్‌బంధన్‌కు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నారు మాయావతి. సమాజ్‌వాదీ పార్టీతో తెగదెంపులు చేసుకొని ఒంటరిగానే ముందుకెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమైన బీఎస్పీ అధినేత్రి మాయావతి యూపీ ఉప ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేద్దామని ప్రకటించారు. ఆమె వ్యాఖ్యలు మహాకూటమి భవిష్యత్‌ను ప్రశ్నార్థకంలో పడేశాయి.
యూపీలో కొందరు ఎమ్మెల్యేలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి ఎంపీలుగా గెలిచారు. వారంత తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయా చోట్ల ఉపఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో ఎస్పీతో పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేయాలని మాయావతి నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ద్వారా తమకు ప్రయోజనం చేకూరలేదని ఆమె అసహనం వ్యక్తంచేసినట్లు సమాచారం. మహకూటమి వృథాయే అన్న రీతిలో ఆమె మాట్లాడినట్లు తెలుస్తోంది.
మరోవైపు బీఎస్సీ నిర్ణయం గురించి తమకు తెలియదని సోమవారం అఖిలేశ్ యాదవ్ అన్నారు. తాను అజాంగఢ్ ప్రజలను కలిసేందుకు వచ్చానని చెప్పారు. బీజేపీని ఓడించాలంటే క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. ఉపఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసే అంశంపై బీఎస్సీ నుంచి అధికారిక ప్రకటన రాలేదని పలువురు ఎస్పీ నేతలు వ్యాఖ్యానించారు. మాయావతి అధికారిక ప్రకటన చేసిన తర్వాత భవిష్యత్ కార్యచరణపై దృష్టిసారిస్తామని చెప్పారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి. బీఎస్సీ 38, ఎస్పీ 37, ఆర్ఎల్డీ 3 స్థానాల్లో పోటీచేశాయి. సోనియా కోసం రాయ్‌బరేలీ, రాహుల్ కోసం అమేథీ స్థానాల్లో అభ్యర్థులను నిలపలేదు. ఐతే లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ 10 సీట్లు గెలుచుకోగా..సమాజ్‌వాదీ పార్టీ కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఆర్ఎల్డీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. కాంగ్రెస్ కోసం వీరు వదిలేసిన అమేథీ సీటు బీజేపీ గెలుచుకుంది. ఎన్నికల ఫలితాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మాయావతి ఉప ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akhilesh Yadav, Mayawati, Sp-bsp, Uttar pradesh