ఫిరాయింపు సీట్లలో కొత్తవాళ్లతో బరిలోకి టీడీపీ

ప్రజాకూటమి గెలుపే లక్ష్యంగా సీట్ల పంపకాల్లో మెట్టుదిగి రాజీ మార్గాన్ని అనుసరించిన టీడీపీ, తనకు దక్కిన 13 స్థానాల్లో అభ్యర్థుల్ని అత్యంత జాగ్రత్తగా ఎంపికచేసింది. ముఖ్యంగా ఇదివరకు పార్టీ తరపున గెలిచి, ఫిరాయింపులకు పాల్పడిన నేతలు పోటీ చేసిన నియోజకవర్గాల్లో కొత్త వాళ్లను రంగంలోకి దింపుతోంది. ఈ వ్యూహం ఫలిస్తుందా? బెడిసికొడుతుందా?

news18-telugu
Updated: November 20, 2018, 10:05 AM IST
ఫిరాయింపు సీట్లలో కొత్తవాళ్లతో బరిలోకి టీడీపీ
టీడీపీ అధినేత చంద్రబాబు (ఫైల్ ఫొటో)
  • Share this:
వ్యూహాలు, ఎత్తుగడలూ వెయ్యడంలో టీడీపీ అధినేత చంద్రబాబుది ప్రత్యేక శైలి. సందర్భం ఎప్పుడైనా సరే, ప్రత్యర్థుల్ని దీటుగా ఎదుర్కోవడంపైనే ఆయన దృష్టి సారిస్తారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచీ టీఆర్ఎస్‌లోకి ఫిరాయించిన అసెంబ్లీ సభ్యుల్ని టార్గెట్‌గా చేసుకొని అడుగులు వేస్తున్నారు చంద్రబాబు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచీ గెలిచిన 15 మందిలో 12 మంది టీఆర్ఎస్‌లో చేరారు. ఇప్పుడు వాళ్లను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు చంద్రబాబు. ప్రజాకూటమి సీట్ల కేటాయింపు జరిగేటప్పుడు, నేతలు ఫిరాయించిన అసెంబ్లీ స్థానాల్లో పదింటిలో పోటీ చెయ్యాలని టీడీపీ భావించింది. ఐతే, ఆ స్థానాల్లో ఇప్పుడు బలమైన కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నచోట రాజీకి వచ్చి, కాంగ్రెస్‌కే వాటిని వదిలేసింది.

ఇప్పుడు శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, సనత్‌నగర్, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్‌లను టీడీపీ ఎంపిక చేసుకుంది. ఈ స్థానాల్లో కొత్త వాళ్లను రంగంలోకి దింపి, పార్టీ ఫిరాయించినవాళ్లను ఓడించాలని భావిస్తోంది. తెలంగాణలో నాలుగేళ్లుగా పార్టీ నాయకులంతా వివిధ పార్టీల్లోకి వెళ్లిపోయినప్పటికీ, పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్న వాళ్లని ఈ నియోజకవర్గాల్లో పోటీకి దింపుతోంది. వీళ్లంతా పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, పార్టీ పటిష్టానికి కష్టపడినవాళ్లే. వీళ్ల సేవల్ని గుర్తించి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం కల్పించింది హైకమాండ్. ఐతే, వీళ్లలో పార్టీ కుటుంబానికి చెందిన దివంగత నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినిని కూకట్‌పల్లి స్థానానికి ఎంపిక చేసి కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. సుహాసిని ఎంపికతో పక్కనే ఉన్న సనత్‌నగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో పార్టీకి అనుకూల ప్రభావం ఉంటుందని అధిష్టానం భావిస్తోంది.

టీడీపీ నుంచీ టీఆర్ఎస్‌లో చేరిన నేతలు పోటీ చేస్తున్న ఆరు నియోజకవర్గాల్ని కాంగ్రెస్‌కి వదిలేసింది టీడీపీ. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, మహేశ్వరం స్థానాల్లో టీడీపీకి బలం ఉన్నప్పటికీ కూటమి గెలుపే లక్ష్యంగా వాటిని కాంగ్రెస్‌కి ఇచ్చేసింది. 2014లో గెలిచిన అన్ని స్థానాల్లో సర్వేలు చేయించి, ఇప్పుడు కచ్చితంగా గెలుస్తామనే స్థానాలపైనే టీడీపీ దృష్టి సారిస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో జరిగిన సమావేశంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సీట్ల కేటాయింపు జరిగింది. ఎలాంటి వివాదమూ లేకుండా టీడీపీకి కాంగ్రెస్ 14 స్థానాలు కేటాయించింది. ఐతే నామినేషన్లు సమర్పించే చివరి రోజున టీడీపీకి కేటాయించిన స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. పొత్తులో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం టీడీపీకి వచ్చింది. కానీ సోమవారం మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. ఇబ్రహీంపట్నం టిక్కెట్‌ను టీడీపీ, సామ రంగారెడ్డికి ఇచ్చింది. కానీ ఆయన ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిగా లేరు. దీంతో కాంగ్రెస్ నుంచీ మల్‌రెడ్డి పోటీలో నిలబడ్డారు. అందువల్ల టీడీపీకి 13 స్థానాలే దక్కినట్లైంది. ఓవైపు 5 సీట్లు మాత్రమే దక్కుతాయనుకున్న టీజేఎస్, ఏకంగా 8 సీట్లు దక్కించుకోగా, టీడీపీ మాత్రం ఇదివరకు గెలిచినన్ని స్థానాలను కూడా దక్కించుకోలేకపోయినట్లైంది.

రాహుల్ గాంధీతో కలిసి బహిరంగ సభల్లో పాల్గొనేందుకు చంద్రబాబు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. సీమాంధ్ర ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో చంద్రబాబుతో పాటు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మంత్రులు కూడా ప్రచారంలో పాల్గొంటారని సమాచారం. మొత్తమ్మీద పార్టీగా కంటే, కూటమిని గెలిపించి అధికారంలోకి తేవాలని టీడీపీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.

First published: November 20, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు