news18-telugu
Updated: November 26, 2020, 7:41 PM IST
బీజేపీలో చేరిన స్వామి గౌడ్
GHMC Elections: గ్రేటర్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. టీఆర్ఎస్, ఎంఐఎంకి ధీటుగా ప్రచారం చేస్తున్న బీజేపీ.. అదే సమయంలో పెద్ద ఎత్తున ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ కార్పొరేటర్లు తమ పార్టీలో చేర్చుకుంది. కేవలం ఈ ఎన్నికల వరకే కాదు.. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా.. ఇప్పటి నుంచే పక్కాగా వ్యూహాలను రచిస్తోంది. ఇతర పార్టీల నుంచి ముఖ్యమైన నేతలను తమ వైపు ఆకర్షిస్తోంది. దుబ్బాకలో బీజేపీ విజయంతో పక్క పార్టీల్లోని నేతలు కూడా కాషాయం వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్కు బిగ్ షాక్ ఇచ్చారు స్వామిగౌడ్. అందరూ ఊహించినట్లుగానే గులాబీ దళానికి గుడ్‌బై చెప్పి.. కషాయ తీర్థం పుచ్చుకున్నారు.
ఇవాళ ఢిల్లీ వెళ్లిన స్వామిగౌడ్.. బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయన్ను జేపీ నడ్డా సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడిన స్వామి గౌడ్.. '' బీజేపీలో చేరికతో తిరిగి నా ఇంటికి వచ్చినట్లుంది. ఆత్మగౌరవం కోసం తెలంగాణ పోరాటం జరిగింది. రాష్ట్రం సాధించుకున్నా ఎలాంటి మార్పు లేదు. ఉద్యమకారులను దూరం పెట్టారు. నా నిర్ణయాన్ని కేసీఆర్ ఆమోదిస్తారని అనుకుంటున్నా. పదువులు ఆశించకుండా బీజేపీలో చేరాను. ఉద్యమకారులకు బీజేపీలో తగిన గౌరవం లభిస్తుంది.'' అని అన్నారు.
కాగా, తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాల తరపున స్వామి గౌడ్ కీలక భూమిక పోషించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక.. స్వామిగౌడ్‌కు సీఎం కేసీఆర్ సుముచిత స్థానం కల్పించారు. మండలి ఛైర్మన్‌గా ఆయన్ను నియమించారు. ఐతే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత స్వామిగౌడ్‌కు ఎలాంటి పదవి కేటాయించలేదు కేసీఆర్. ఈ క్రమంలోనే స్వామి గౌడ్ టీఆర్ఎస్కు దూరంగా ఉంటున్నారు. బాహాటంగానే విమర్శలు చేస్తూ హాట్ టాపిక్‌గా మారారు.
మరోవైపు కాంగ్రెస్ నుంచి కూడా కొందరు నేతలు బీజేపీలోకి చేరబోతున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీతో అంటీముట్టనట్టుగా ఉన్న విజయశాంతి కూడా కాషాయ గూటికి చేరుతారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. దుబ్బాక ఎన్నికల ఫలితం తర్వాత ఆమె బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ఎంఐఎం, టీఆర్ఎస్పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక మరో నేత విశ్వేశ్వర్ రెడ్డి కూడా బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే కేంద్రహోంమంత్రి అమిత్ షా జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ రానున్నారు. ఆ సందర్భంగా అమిత్ షా సమక్షంలో వీరంతా బీజేపీలో చేరుతారని సమాచారం.
Published by:
Shiva Kumar Addula
First published:
November 25, 2020, 6:52 PM IST