సీఎం కేసీఆర్ నిర్ణయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో అస్సలు ఊహించలేం. ఆయన ఎప్పుడు ఎవరికి పదవులు ఇస్తారు ? ఎవరికి చెక్ చెబుతారనే అంశం ఎవరికీ అంతుచిక్కదు. తాజాగా టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి విషయంలో గులాబీ బాస్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్సీగా నాయిని నర్సింహారెడ్డి పదవీకాలం ముగుస్తుండటంతో... ఆయనకు మళ్లీ ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. అయితే కేసీఆర్, నాయినికి మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయిందని... అందుకే నాయినికి కేసీఆర్ మరోసారి ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చే అవకాశాలు తక్కువే అనే చర్చ జరుగుతోంది.
గతంలోనే నాయినికి టీఆర్ఎస్ నాయకత్వం ఓ నామినేటెడ్ పోస్టు ఆఫర్ చేసిందని... ఆయన మాత్రం తనకు రాజ్యసభ సీటు కావాలని కోరారని పలువురు చర్చించుకుంటున్నారు. తన అల్లుడు, రాంనగర్ కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి పొలిటికల్ ఫ్యూచర్‌ను గాడిలో పెట్టాలని నాయిని ఎంతగానో ప్రయత్నించారు. అయితే ఆయన ప్రయత్నాలు అంతగా ఫలించలేదు. అయితే తాజాగా నాయినికి మరోసారి ఎమ్మెల్సీ సీటు ఇవ్వని పక్షంలో ఆయనకు పార్టీలో పెద్దగా గుర్తింపు ఉండకపోవచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

కేసీఆర్‌తో నాయిని(ఫైల్ ఫోటో)
మరోవైపు నాయినికి మరోసారి ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం లేదని టీఆర్ఎస్ నాయకత్వం ఇప్పటికే ఆయనకు స్పష్టమైన సంకేతాలు పంపిందని కొందరు చర్చించుకుంటున్నారు. అయితే సీనియర్ నేత కేకే విషయంలో గతంలోనే ఇలాంటి ప్రచారమే జరిగిందని... అయితే సీఎం కేసీఆర్ మళ్లీ ఆయనకు రాజ్యసభ సీటు రెన్యువల్ చేశారని నాయిని వర్గం ఆశిస్తోంది. కేకే విషయంలో జరిగిందే.. నాయిని విషయంలోనూ జరుగుతుందని ఆయన అనుచరులు భావిస్తున్నారు. మొత్తానికి టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి తనతో ఉన్న నాయిని ఎమ్మెల్సీ పదవి విషయంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది సస్పెన్స్‌గా మారింది.