వంగవీటి రాధా విజయవాడను వీడాల్సిందేనా ? టీడీపీలోనూ అంతేనా ?

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వంగవీటి రాధాకృష్ణను టీడీపీ మొదట మచిలీపట్నం నుంచి బరిలోకి దింపాలని భావించిన టీడీపీ... తాజాగా తూర్పుగోదావరి జిల్లా నరసాపురం లేదా విశాఖ జిల్లా అనకాపల్లి లోక్‌సభ నుంచి పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

news18-telugu
Updated: March 14, 2019, 1:22 PM IST
వంగవీటి రాధా విజయవాడను వీడాల్సిందేనా ? టీడీపీలోనూ అంతేనా ?
వంగవీటి రాధాకృష్ణ( Facebook Image)
  • Share this:
విజయవాడ నగర పరిధిలో తాను ఆశించిన టికెట్ ఇవ్వడానికి నిరాకరించారనే కారణంగానే వంగవీటి రాధాకృష్ణ ఆ పార్టీని వీడారనే టాక్ ఉంది. పైకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధోరణి నచ్చకపోవడం వల్లే తాను పార్టీని వీడానని వంగవీటి రాధా చెబుతున్నా... విజయవాడ కాకుండా మచిలీపట్నం ఎంపీ లేదా ఇతర స్థానాల నుంచి పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం రాధాను కోరినట్టు వార్తలు వినిపించాయి. కారణం ఏదైనా వంగవీటి రాధా వైసీపీని వీడారు. కొంతకాలం వేచిచూసి టీడీపీలో చేరడం కూడా జరిగిపోయింది. అయితే పార్టీ మారినా... విజయవాడ రాజకీయాల్లోనే రాణించాలన్న వంగవీటి రాధాకృష్ణ లక్ష్యం మాత్రం నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు.

బుధవారం రాత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వంగవీటి రాధాకృష్ణను మొదట మచిలీపట్నం నుంచి బరిలోకి దింపాలని భావించిన టీడీపీ... తాజాగా తూర్పుగోదావరి జిల్లా నరసాపురం లేదా విశాఖ జిల్లా అనకాపల్లి లోక్‌సభ నుంచి పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. నరసారపురం, అనకాపల్లి నియోజకవర్గాల పరిధిలో కాపు ఓటర్ల సంఖ్య అధికంగా ఉండటంతో... వంగవీటి రాధాకృష్ణను ఈ రెండు స్థానాల్లో ఏదో ఒక చోట నుంచి నుంచి బరిలోకి దింపాలనే యోచనలో టీడీపీ ఉన్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా నరసాపురం బరిలో ఉన్న రఘురామకృష్ణంరాజును ఢీ కొట్టేందుకు బలమైన కాపు సామాజికవర్గం నేతగా గుర్తింపు తెచ్చుకున్న వంగవీటి రాధాకృష్ణ వైపు టీడీపీ చూస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.

నరసాపురంలో కుదరకపోతే అనకాపల్లి నుంచి వంగవీటి రాధాను పోటీ చేయించే ఆలోచన కూడా టీడీపీకి ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ రెండు స్థానాల్లో ఎక్కడి నుంచి పోటీ చేసినా... వంగవీటి రాధా విజయవాడను వీడాల్సి రావొచ్చని కొందరు చర్చించుకుంటున్నారు. అదే జరిగితే వంగవీటి ఫ్యామిలీకి పట్టున్న విజయవాడలో రాధా పట్టుకోల్పోవాల్సి వస్తుందనే టాక్ కూడా వినిపిస్తోంది. మొత్తానికి తనను విజయవాడ రాజకీయాల నుంచి దూరం చేయాలని చూస్తున్నారంటూ వైసీపీని వీడిన వంగవీటి రాధాకృష్ణ... టీడీపీలో చేరిన తరువాత కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటారా అన్నది చూడాలి.First published: March 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>