ఏపీలో పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా టీడీపీ అధ్యక్షుల నియామకం జరిగింది. ఇందుకు సంబంధించిన జాబితాను కూడా ప్రకటించారు. అయితే ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా మాజీమంత్రి, టీడీపీ ముఖ్యనేత అచ్చెన్నాయుడును నియమిస్తారనే దానిపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. పార్టీ పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్షులతో పాటుగానే ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు పేరును ప్రకటిస్తారనే వార్తలు వచ్చాయి. కష్టకాలంలో పార్టీని అండగా ఉండే అచ్చెన్నాయుడుకు కీలక పదవి ఇవ్వడం ద్వారా బీసీలకు మరింత దగ్గర కావడంతో పాటు ఉత్తరాంధ్రకు టీడీపీ అధిక ప్రాధాన్యత ఇస్తుందనే భావన ప్రజల్లో కలుగుతుందని టీడీపీ భావించింది.
అందుకే అచ్చెన్నాయుడును ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నియమించడం దాదాపు లాంఛనమే అనే ప్రచారం జరిగింది. అయితే ఇందుకు సంబంధించిన ప్రకటన రాకపోవడంతో.. అచ్చెన్నాయుడికి ఈ పదవి దక్కుతుందా లేదా అని టీడీపీలో ఆసక్తి మొదలైంది. మరోవైపు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న అచ్చెన్నాయుడుకు ఈ పదవి ఇవ్వడం కంటే మరో నేతకు ఈ పదవి ఇవ్వాలని కొందరు అధినేతకు సూచించారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాకు చెందిన బీసీ నేత బీద రవిచంద్ర పేరు తెరపైకి వచ్చిందనే చర్చ కూడా పార్టీలో జరుగుతోంది.

చంద్రబాబు(ఫైల్ ఫోటో)
ఏపీ టీడీపీ అధ్యక్ష పదవిని కచ్చితంగా బీసీలకే ఇవ్వాలని నిర్ణయించుకున్న చంద్రబాబు.. ఈ పదవిని అచ్చెన్నాయుడుకు ఇవ్వాలా లేక బీద రవిచంద్రకు అప్పగించాలా అనే దానిపై మాత్రం ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే టీడీపీలోని కొందరు మాత్రం ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి విషయంలో చంద్రబాబుకు మరో ఆలోచన లేదని చెబుతున్నారు. అచ్చెన్న విషయంలో అధినేత ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
శుక్రవారంలోపు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు పేరు ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. టీడీపీ ఏపీ కమిటీని ఆ రోజే ప్రకటించే అవకాశం ఉందని.. కమిటీ కూర్పు కోసమే అచ్చెన్న పేరును ఇప్పటివరకు ప్రకటించలేదంటున్న టీడీపీ ముఖ్యనేతలు చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఏపీ టీడీపీలో ముఖ్యనేతగా కొనసాగుతున్న అచ్చెన్నాయుడుకు ఏపీ టీడీపీ చీఫ్ పోస్టు దక్కుతుందా లేదా అన్నది మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.
Published by:Kishore Akkaladevi
First published:September 28, 2020, 15:17 IST